వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి అనాగరిక చర్య
పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు
చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు, మూకలకు ధైర్యం
ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని సర్కార్‌కు పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం
హిందూపురం ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది వైఎస్సార్‌సీపీపై దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి అని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో దాడికి సంబంధించిన వీడియోతో సహా పోస్టు చేశారు.
‘హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్‌ను పగలగొట్టడం, అద్దాలను విరగ్గొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా దీన్ని భావించాలి. చంద్రబాబు నాయకత్వం మద్దతుతో టీడీపీ నేతలు, రౌడీ మూకలు హింసాత్మక చర్యల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టి, రాజకీయ వ్యతిరేకతను అణచి వేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.


