
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
- :ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యం
- పేదలంటే కూటమి ప్రభుత్వానికి అలుసు
- అందుకే ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం
- పీపీపీ పేరుతో తమ వారికి కట్టబెట్టే కుట్ర
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఆందోళన
- :స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ
విజయనగరం విశాఖపట్నం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు దారిపొడవునా మద్దతు తెలపడం ద్వారా ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్రా ఇలవేల్పు పైడితల్లమ్మ జాతరలో తాను కూర్చున్న వేదిక కూలిన ఘటనలో కుట్ర కోణం దాగుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మూటికీ జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమేనన్న బొత్స... అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జరిగిన ఘటనపై గౌరవ గవర్నర్ తో పాటు సీఎస్ కు లేఖ రూపంలో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
పైడిమాంబ జాతర అపశృతిలో కుట్రకోణం..
అధికారంలో ఎవరు ఉన్నా విజయనగరం పైడిమాంబ అమ్మవారి ఉత్సవం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయరు. ఒకవేళ చేసినా పశ్చాత్తాపంతో వెంటనే సరిదిద్దుకుంటారు. ఉత్తరాంధ్రా ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ కరుణాకటాక్షాలతో ఈ ప్రాంతం సుభిక్షింగా ఉంది. పూర్వం అమ్మవారి ఉత్సవాలను గ్రామంలో పెద్దలు సొంత నిధులతో చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం, అధికారులు ఇన్ వాల్వ్ అయి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయడం జరుగుతుంది.
నేను కూడా 15 ఏళ్ల పాటు మంత్రిగా, 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు ఉత్సవాల్లో పాల్గొన్నాను. కానీ ఈ ఏడాది దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలో ఉన్న అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదు. ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. అమ్మవారి పండగ అందరిదీ.. కానీ కొంతమంది ప్రాపకం కోసం విడ్డూరంగా ప్రవర్తించారు. ఏం మాట్లాడిన పైడితల్లి అమ్మవారికి అపవాదు వస్తుందన్న భయంతోనే నేను మాట్లాడుతున్నాను. అధికారులు మాత్రం ద్వంద్వ ప్రమాణాలతో పండగ జరిపించారు. పండగలో ఆర్భాటం, ఆహంకారం తప్ప సాంప్రదాయాలకు తావివ్వలేదు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్పడం లేదు, విజయనగరం పట్టణంలో ఏ తలుపుతట్టి ప్రజల అభిప్రాయం తీసుకున్నా ఇదేమాట అంటారని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
ప్రభుత్వ కార్యాలయాలలో హుండీలు పెట్టి మరీ దోపిడీ...
ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న నిధుల మేరకు పండగ నిర్వహిస్తాం. దాతల సహకారం అందిస్తే అది కూడా ఉపయోగించుకోవడం ఆనవాయితీ. ఈ సారి మాత్రం పండగ నిర్వహణ కోసం ఎమ్మార్వో కార్యాలయం, ఆర్డీఓ ఆఫీసు, ఎక్సైజ్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లలో హుండీలు ఏర్పాటు చేసి కలెక్ట్ చేశారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఎందుకు నిధులు సేకరించారో అర్ధం కావడం లేదు. ఇది ఎందు కోసం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమే. రాజకీయ నాయకులు తమ అహంకారాన్ని, గొప్పని చూపించాలని ప్రయత్నం చేయడం సహజం. కానీ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించాలి. ఇదేం పద్దతి ? అకౌంట్ నెంబర్లు ఇస్తారా ?
వేదిక కూలిన ఘటనపై గవర్నర్ , సీఎస్ కు లేఖ..
గొప్పలు చెబుతున్న గౌరవ గోవా గవర్నర్ గారు ఇంకా విజయనగరంలోనే ఉన్నారు. గతంలో చాలా మాటలు చెప్పారు. వారి ఆలోచన ఏమైంది? ఎందుకు అధికారులకు దిక్సూచిగా నిలబడలేదు ? ఇక నేను అమ్మవారి దర్శనానికి సంబంధించి నా వ్యక్తిగత ప్రోటోకాల్ పై లేఖ రాశాను. వారికి తోచిన ఏర్పాట్లు వారు చేశారు. ఉత్సవాల్లో ఏం జరిగిందో అంతా చూశాం. మాకు ఏర్పాటు చేసిన వేదిక కుప్పకూలిపోయింది. ఇది కుట్రా? అధికారుల అలసత్వమా? లేదంటే మమ్నల్ని అవమానపర్చాలని చేశారా? అంతమొందించాలని చేశారా? అధికారులు దీనికి సమాధానం చెప్పాలి. వేదిక కూలిన ఘటనలో ఎమ్మెల్సీ సురేష్ బాబు చేయి డిస్ లోకేట్ అయింది. మరొకరికి ఫ్రాక్చర్ కాగా.. మరో అమ్మాయికి దెబ్బలు తగిలాయి.
అధికారులకు ఇంగిత జ్ఞానం లేదా? జిల్లా అధికారులుగా పలకరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేదా ? ఉద్యోగంలో కొత్తగా చేరారా? శాసనమండలి ప్రతిపక్షనేత కోసం అధికారుల ఏర్పాటు చేసిన వేదిక కూలిపోతే కనీసం ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అమ్మవారిని నమ్ముకున్న భక్తులుగా నాకు ఎలాంటి ఇబ్బంది లేకపోగా... కొంతమంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మా మీద అధికారులకు వ్యక్తిగతంగా ఎందుకు అంత కక్ష? మమ్నల్ని అవమానపర్చాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దీనిపై నేను సీఎస్ కు, గవర్నర్ గారికి లేఖ రాస్తాను.
అమ్మవారి పండగలో ఒకవైపు అడుగడుగునా నిర్లక్ష్యం, అలసత్వం, కుట్ర కాగా.. మరోవైపు దోపిడీ, ఇదేనా ప్రజాస్వామ్యం? ఇది సరైన విధానం కాదు. ఇలాంటి విషయాలను ఉపేక్షిస్తే సమాజానికే నష్టం. దీని వెనుక ఎవరున్నారన్న పూర్తి వివరాలు బయటకు రావాలి. నేను జిల్లా అధికారులనే ప్రశ్నిస్తున్నాను. రాజకీయ నాయకులు వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత కోణంలో ఏవేవో మాట్లాడుతారు. కాని అధకారులకు ఆలోచన ఉండాలి. ఏం జరిగిందన్నది కూడా కనీసం ఆలోచన చేయలేదు. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవు అన్న విషయం గుర్తించుకోవాలి. దీనికంతటికీ కారణం ప్రభుత్వ అలసత్వం. అధికారుల మీద పట్టు లేకపోవడమే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను దిగజారుస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్మాణంలో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. 6 కాలేజీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. పులివెందులలో కాలేజీ ప్రారంభమయ్యేనాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఆ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ కేటాయించిన సీట్లను వద్దని లేఖ రాసింది. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయాలని విధాన పరమైన నిర్ణయం తీసుకున్న కూటిమి ప్రభుత్వం ఇందులో భాగంగా తొలి విడతగా 4 కాలేజీలకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ లేఖలు కూడా పిలిచింది.
ఆ నేపథ్యంలో.. ప్రజారోగ్యం, విద్య రెండూ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి, వాటిని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం కలుగుతుందన్న విధానంతో వైఎస్సార్‌సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించింది. ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ విద్య పేదలకు అందని ద్రాక్ష అవుతుంది కాబట్టి... ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించిన నేపథ్యంలో... మా పార్టీ అధ్యక్షుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్బంగా విశాఖ పట్నం విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి వెళ్లేంత వరకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వైఎస్‌జగన్ కు మద్ధతు తెలిపారు. ప్రజా స్పందన చూసిన తర్వాత... ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తద్వారా సామాన్య ప్రజలకు వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులో ఉంచాలి.
ప్రజలు మిమ్నల్ని ఎన్నుకున్న పాపానికి వారికి ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేయవద్దని కోరుతున్నాం. ప్రజలు మిమ్నల్ని ఐదేళ్ల పాలించమని ఎన్నుకున్నారే తప్ప.. యాభై ఏండ్లకు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎందుకు చేయడం లేదంటే.. నిధులు లేవని సాకులు చెబుతున్నారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకా మరో రూ.6వేల కోట్లు అవసరం అవుతాయి. దానికి నిధులు లేవని చెబుతున్నారు. కానీ 16 నెలల కూటమి పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు? ఎవరికి దోచిపెట్టారు? అవి సరిపోక ఇంకా ప్రైవేటు కాలేజీలను కూడా దోపీడీ చేసి తాబేదార్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ప్రజలు మీ తప్పిదాలను క్షమించరు. పేద ప్రజల ఉసురు పోసుకోవద్దు.
గిరిజన విద్యార్దినుల పై నిలువెత్తు నిర్లక్ష్యం...
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఇంతమంది పిల్లలు ఒకే స్కూల్ నుంచి ఆసుపత్రి పాలైవడం ఎప్పుడైనా జరిగిందా? 170 మంది పిల్లలకు ఒకేసారి జాండిస్ రావడమా? ఎంత నిర్లక్ష్యం? ఎంత పర్యవేక్షణ లోపం? ఇదేనా పరిపాలన? ఇద్దరు చిన్నారులు చనిపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకో 15 మంది పిల్లలకు జాండిస్ అని తేలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఐదేళ్లలో కలుషిత ఆహారం, ఆనారోగ్యం వంటి ఘటనలు ఎప్పుడైనా జరిగితే...అందుకు పది శాతం ఎక్కువగా కేవలం ఈ 16 నెలల కాలంలోనే జరిగాయి. ప్రభుత్వ పనితీరుకు, విద్యార్ధుల మీద ఉన్న శ్రద్దకు, ప్రభుత్వ విధానానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధికారులు పిల్లల మీద దృష్టిపెట్టాలని బొత్స సూచించారు. ప్రజల్లో నిరాస, నిస్పృహలు వస్తే ఏం జరుగుతుందో పక్క దేశంలో చూశామని.. . కాబట్టి బాధ్యతతో మెలగాలని ప్రభుత్వానికి హితవు పలికారు.