అదానీ వైజాగ్ టెక్ పార్కులో గూగుల్ భాగస్వామి
సీఐఐ వేదికగా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ ఎండీ కరణ్ అదానీ స్పష్టీకరణ
కుండబద్దలు కొట్టినట్లు వాస్తవం వెల్లడించడంతో విస్తుపోయిన చంద్రబాబు
తద్వారా ఇన్నాళ్లూ చంద్రబాబు చేసింది దుష్ప్రచారమేనని తేటతెల్లం
వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే అదానీ వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్
ఈ విషయాన్ని దాచి తాను క్రెడిట్ కొట్టేసేందుకు బాబు విఫల యత్నం
తాజాగా కరణ్ అదానీ ప్రకటనతో ఇరుకున పడ్డ బాబు సర్కారు
రెండు సంస్థలు కలిసి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నాయని అదానీ వెల్లడి
ఇప్పటికే పోర్టులు, సిమెంట్, ఎనర్జీ డేటా సెంటర్స్ రంగాల్లో రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
వీటిని కొనసాగిస్తూ వచ్చే పదేళ్లలో మరో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
ఇన్ని వాస్తవాల మధ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో మళ్లీ క్రెడిట్ చోరీకి యత్నం
ఇదేం విడ్డూరమంటూ పారిశ్రామికవేత్తల్లో విస్తృత చర్చ
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్‌ను గూగుల్‌తో కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ప్రకటించారు. శుక్రవారం విశాఖ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ వైజాగ్ టెక్ పార్కులో ఇద్దరం కలిసి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. తద్వారా విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు బట్టబయలు అయ్యింది.
అదానీ గ్రూపు పేరును దాస్తూ గూగుల్ డేటా సెంటర్‌ను తామే తెచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ మరోమారు చర్చకు వచ్చింది. విశాఖలో అతిపెద్ద హైపర్ డేటా సెంటర్‌ను గూగుల్‌తో కలిసి అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎదుటే కరణ్ అదానీ ప్రకటించడం కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినట్లయింది.
ఇది అన్నిచోట్లా ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ కాదని, ఇది ఇండియా డిజిటల్ చరిత్రను తిరగరాస్తుందని కరణ్ అదానీ తెలిపారు. ఈ డేటా సెంటర్‌ను పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇదే విషయాన్ని కరణ్ అదానీ చంద్రబాబు ఎదురుగానే కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కరణ్ అదానీ గూగుల్ కలిసి డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించిన వెంటనే సీఎంతోపాటు వేదికపైన ఉన్న టీడీపీ మంత్రుల ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి.
సీఐఐ వేదికగా మళ్లీ అదే బొంకుడు
ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్‌లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకోవడంతోపాటు, డేటా సెంటర్‌కు డేటా తీసుకురావడం కోసం సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్ సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేసే ప్రాజెక్టుకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దేశంలోని డేటా సెంటర్ ఏర్పాటు బాధ్యతలను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ అదానీకి అప్పగించింది. గూగుల్‌తో అనుబంధం ఉన్న అదానీ సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపులో భాగంగానే అదానీతో కలిసి గూగుల్ 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను విస్తరిస్తోంది.
ఇదే విషయాన్ని ఇప్పుడు కరణ్ అదానీ సీఐఐ వేదికగా చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సైతం ఆ విషయాన్ని దాచి పెట్టడం ద్వారా చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు అంతర్జాతీయ సమాజానికి తెలిసింది. చంద్రబాబు సర్కారు తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఇదే విషయమై సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తల మధ్య ఇదేం విడ్డూరం అంటూ విస్తృతంగా చర్చ జరిగింది. 
విశాఖ సదస్సులో ప్రసంగించిన అనంతరం కరణ్ అదానీ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్
పెట్టుబడుల కొనసాగింపు..
అదానీ గ్రూపునకు ఆంధ్రప్రదేశ్‌తో దీర్ఘకాలంగా అనుబంధం ఉందని, ఇప్పటికే రాష్ట్రంలో పోర్టులు, సిమెంట్, ఎనర్జీ డేటా సెంటర్స్ వంటి రంగాల్లో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని, దీన్ని కొనసాగిస్తూ వచ్చే పదేళ్లలో మరో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు కరణ్ అదానీ ప్రకటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందని, దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌లలో ఒకటని వ్యాఖ్యానించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టులో భాగం కావడం ఆనందంగా ఉంది: జీఎంఆర్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు(జీఎంఆర్) పేర్కొన్నారు. ఇక్కడ భారీ ఎంఆర్‌వో యూనిట్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకో సిస్టంను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ యువతకు అండగా ఉండేలా రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లను విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి మాట్లాడుతూ నౌకా నిర్మాణం, పర్యాటకం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో మల్లవల్లి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ నుంచి మామిడి, జామ రసాల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందన్నారు.


