మూడేళ్లలోనే ఈ ఒప్పందాలన్నీ అమల్లోకి వస్తాయి
రెండు రోజుల సమావేశాల్లో 613 ఎంఓయూల ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు
18 నెలల్లో రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం
మీడియాతో సీఎం చంద్రబాబునాయుడు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి : సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈసారి చాలా సీరియస్ ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వచ్చే మూడేళ్లలో వీటిని అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రెండ్రోజుల పాటు విశాఖలో జరిగిన ఈ సదస్సులో 613 ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రూ.13,25,716 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు రానున్నాయని శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరించారు.
18 నెలలో కాలంలో రూ.21 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలను కుదుర్చుకోవడమే కాక.. ఇందులో ఇప్పటికే రూ.8.8 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులను మంజూరుచేసినట్లు ఆయన చెప్పారు. ఈ సదస్సులో నాలుగు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారని, ఇందులో 640 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగం నుంచి వచ్చాయన్నారు.
ఈ రంగంలో రూ.5,33,351 కోట్ల పెట్టుబడులు వస్తే పరిశ్రమల రంగానికి రూ.2,80,384 కోట్లు, మౌలిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల బకాయిలన్నీ చెల్లించేశామన్నారు. వచ్చే ఏడాది ఇదే తేదీల్లో తిరిగి పెట్టుబడుల సదస్సును నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
మినీ వరల్డ్‌గా శ్రీసిటీ..
అంతకుముందు.. సదస్సు రెండోరోజైన శనివారం వివిధ కార్యక్రమాలతో పాటు ఆ తర్వాత జరిగిన సదస్సు ముగింపు సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీసిటీని ఒక మినీ వరల్డ్‌గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం మరో 6,000 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శ్రీసిటీలో 30కి పైగా వివిధ దేశాల కంపెనీలున్నాయని, వీటిని రెండేళ్లలో 50 దేశాలకు పెంచాలన్నారు. కియా దగ్గర్లోనే రేమాండ్స్ సంస్థ ఆటో కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంటును ఏర్పాటుచేయబోతోందన్నారు.
ఇక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3–4 ఏళ్లలోనే చేరుకుంటామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది నవంబరులో విశాఖలోనే జరిగే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వచ్చిన వారికి అరకు, గిరిజన అందాలను చూపిస్తామని ఆయనన్నారు. ఈ సమ్మిట్‌లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తానన్నారు. ఇక రెండ్రోజుల పెట్టుబడుల సమావేశాలు విజయవంతమయ్యాయని.. దావోస్ తరహాలో సీఐఐ ఈ సదస్సును నిర్వహించిందన్నారు.
మరోవైపు.. భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే, శ్రీసిటీలో ఏర్పాటైన ఐదు కంపెనీలను ప్రారంభించారు. దీంతోపాటు.. శ్రీసిటీలో కంపెనీల ఏర్పాటు నిమిత్తం వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.
ఏఐ వర్సిటీ ఏర్పాటులో భాగస్వామ్యంకండి!
అబుదాబి తరహాలో రాష్ట్రంలోని కృత్రిమ మేధ (ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని.. ఇందులో భాగస్వామ్యం కావాలని ఎల్జీ కెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యున్జోకోను సీఎం చంద్రబాబు కోరారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు శనివారం ముఖ్యమంత్రి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాకినాడ, మూలపేటల్లో ఎల్జీ కెమ్ నాఫ్తా క్రాకర్ కాంప్లెక్స్, పాలిమర్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు రావాలని చంద్రబాబు ప్రతిపాదించారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో చర్చించారు.
రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్..
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, ప్రీమియం లగ్జరీ హోటల్ పోర్ట్‌ఫోలియో విస్తరణ అంశాలపై గ్లోబల్ హాస్పిటాలిటీ గ్రూప్ అట్మాస్పియర్ కోర్ దక్షిణాసియా ఎండీ సౌవగ్య మహాపాత్ర, గ్రూప్ ఎండీ సలీల్ పాణిగ్రాహితో సీఎం చర్చించారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో అట్మాస్పియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
గండికోటలో అడ్వంచర్ రిసార్ట్స్, అరకు–అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటు, బొబ్బిలి–విజయనగరం కోటలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిరి్మంచేందుకు అటా్మస్పియర్ కోర్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తంచేశారు.
విశాఖ–కాకినాడ–భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ జుర్గెన్ బైలామ్‌ను సీఎం కోరారు. క్రూయిజ్ టెరి్మనల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది.
గతంలోవి డొల్ల ఒప్పందాలే!
» ఇవి సీరియస్ ఒప్పందాలనడం ద్వారా పరోక్షంగా అంగీకరించిన చంద్రబాబు
»ఇంత మంది మంత్రులు దేశ విదేశాలు తిరిగినా ఫలితం శూన్యం
» ఒక్క కరణ్ అదానీ తప్ప కానరాని పారిశ్రామిక దిగ్గజాలు
» ఒక గిగావాట్ డేటా సెంటర్ ఒప్పందం ఈడీతో మమ అనిపించిన రిలయన్స్
» పాత ఒప్పందాలనే కొత్త ఒప్పందాలుగా చూపిస్తూ పెట్టుబడుల వెల్లువంటూ ప్రచారం
» చప్పగా సాగిన బీ టు బీ, ప్లీనరీ సెషన్స్.. వెలవెలబోయిన సభా ప్రాంగణం
సాక్షి, అమరావతి: సీఐఐ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ పేరిట 2016, 2017, 2018 సంవత్సరాల్లో కుదుర్చుకున్నది డొల్ల ఒప్పందాలేనని సీఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా అంగీకరించారు. ఈ సంవత్సరం కుదుర్చుకున్నవన్నీ సీరియస్ ఒప్పందాలంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఇన్నాళ్లూ పెట్టుబడులు వచ్చేశాయంటూ చేసుకున్నదంతా బూటక ప్రచారమేనని తేల్చేశారు. భారీ హంగామాతో ఈసారి పెట్టుబడుల సమావేశం ఏర్పాటు చేస్తే దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ముఖం చాటేశారు.
విశాఖ సదస్సుకు వచ్చిన వారిలో గౌతమ్ అదాని కుమారుడు కరణ్ అదానీ తప్ప దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ సభా వేదికపై కనింపించ లేదు. మన రాష్ట్రానికి చెందిన గ్రంధి మల్లికార్జునరావు, భారత్ బయోటెక్ సుచిత్రా ఎల్లా, అపోలో హాస్పిటల్స్ శోభన కామినేని చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడు లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ తప్ప ఇతర పారిశ్రామిక దిగ్గజాలు కానరాలేదు.
2023లో వైఎస్ జగన్ హయాంలో నిర్వహించిన సదస్సుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య మిట్టల్, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, బీవీఆర్ మోహన్‌రెడ్డి, భంగర్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరు కావడం ద్వారా సభా వేదిక కళకళలాడగా, ఈసారి వెలవెలబోయిందని గడిచిన నాలుగు సీఐఐ ఈవెంట్స్ కవర్ చేసిన పాత్రికేయులు వ్యాఖ్యానించారు. చివరికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక గిగావాట్ డేటా సెంటర్ ఒప్పందం కుదుర్చుకున్నా, అది కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా కానిచ్చేసింది.
పాత ఒప్పందాలకే కలరింగ్
పెట్టుబడుల కోసం గత ఆరు నెలలుగా మంత్రులంతా విదేశీ పర్యటనలు చేసినా, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 2023లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి కుదుర్చుకుంటూ రూ.13.21 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 2018 పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న రెన్యూపవర్, ఏబీసీ పవర్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, పాల్స్ ప్లస్ టాయ్స్, డైకిన్, ఈ ప్యాక్, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఏటీసీ టైర్స్ తదితర పాత ఒప్పందాలతోనే ఇప్పుడూ మమ అనిపించారు.
నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కోసం ఏర్పాటు చేసిన ప్లీనర్ సెషన్స్ కూడా చాలా పేలవంగా సాగాయి. బిజినెస్ టు బిజినెస్ (బీ టు బీ) ద్వైపాక్షిక చర్చల కోసం ఏర్పాటు చేసిన వేదిక అయితే వ్యాపారవేత్తలు లేక వెలవెలబోయింది. ఎంతో అట్టహాసంగా నిర్వహిద్దామనుకున్న సీఐఐ 30వ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఇలా పేలవంగా ముగియడం పట్ల ముఖ్యమంత్రిలో అసహనం స్పష్టంగా కనిపించింది. చివరి రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చంద్రబాబు విలేకరులపై, స్టీల్ ప్లాంట్ కార్మికులపై వేసిన రంకెలే ఇందుకు నిదర్శనం.


