రూ.3,500 నుంచి రూ.10,500తో దాదాపు 200 మంది బీ–బీ రిజిస్ట్రేషన్
ఒక్కొక్కరు తమ వ్యాపారం గురించి 8–10 మందితో చర్చించే అవకాశం ఇస్తామని వెల్లడి
తీరా సదస్సులో ఆ పరిస్థితే లేకపోవడంతో ఉసూరుమన్న వైనం
సాక్షి, విశాఖపట్నం: లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగాలంటూ అంకెల గారడీతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వాణిజ్య ప్రతినిధుల విషయంలోనూ అదే వైఖరి ప్రదర్శించింది. తమ వాణిజ్య, వ్యాపారాల్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొంత మంది పారిశ్రామికవేత్తలకు భాగస్వామ్య సదస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. బిజినెస్ టు బిజినెస్ (బీ–బీ) సెషన్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు.
'ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రూ.3,500 నుంచి రూ.10,500 వరకు ఫీజు వసూలు చేశారు. దాదాపు 200 మంది వరకు బీ–బీలో రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు 8 నుంచి 10 మంది బిజినెస్ ప్రతినిధులతో బీ–బీ సెషన్‌లో మాట్లాడుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. తీరా భాగస్వామ్య సదస్సుకు వచ్చిన తర్వాత.. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడికొచ్చేసరికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతినిధులు విస్తుపోయారు.
సమస్యలుంటే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పి.. సదస్సు ప్రారంభమయ్యే సమయానికి వెబ్‌సైట్‌నే మూసేశారు. దీంతో కొందరు వాణిజ్యవేత్తలు బీ–బీపై నిర్వాహకులను నిలదీశారు. ‘వెబ్‌సైట్ క్లోజ్ అయిపోయింది.. ఏమీ అనుకోవద్దు.. మీకోసం ఏర్పాటు చేసిన సెషన్ హాల్‌లో కూర్చోండి’ అంటూ తాపీగా సమాధానం చెప్పి జారుకున్నారు. 200 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అక్కడ మాత్రం కేవలం 20 టేబుల్స్.. ఒక్కో టేబుల్ దగ్గర నాలుగు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు.
అవి కూడా మరుగుదొడ్ల పక్కనే ఏర్పాటు చేయడంతో వచ్చినవారు కూడా ఇబ్బందులు పడ్డారు. జామర్ల కారణంగా ఇంటర్నెట్ కూడా పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా వైఫై క్యూఆర్ కోడ్‌లు ఇచ్చారు. వాటిని స్కాన్ చేస్తే ఎర్రర్ రావడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పారిశ్రామికవేత్తలు అసహనం వ్యక్తం చేస్తూ తిరిగి వెళ్లిపోయారు.


