మృతురాలు వీణ, బాబు వియాన్స్ మృతదేహం
అనకాపల్లి జిల్లా: ఆరు నెలల బిడ్డను చంపి, ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. చోడవరం పట్టణ శివారు ద్వారకానగర్ సమీపంలో కనకమహాలక్ష్మినగర్‌లోని తమ నివాస గృహంలో పోరెడ్డి వీణ (30), ఆమె 6 నెలల బాబు బుధవారం సాయంత్రం విగత జీవులై కనిపించారు. వీణ మెడకు చీర ఉరి వేసుకున్నట్టుగా ఉండగా.. ఆమె పక్కనే కన్నకొడుకు మృతదేహం ఉంది. మృతురాలు వీణ భర్త ఉమామహేశ్వరరావు బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామానికి చెందిన వీణ, అదే జిల్లా వీఎం వలస మండలం కౌడుతండ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ప్రేమించుకొని, పెద్దల సమక్షంలో గత ఏడాది జనవరి నెలలో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల బాబు వియాన్స్ ఉన్నాడు. వీరు చోడవరం కనకమహాలక్ష్మినగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోలీసులకు భర్త చెప్పిన వివరాల ప్రకారం.. రోజూలాగే ఉమామహేశ్వరరావు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో భార్య వీణకు ఫోన్ చేస్తున్నప్పటికీ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
పాఠశాల ముగిశాక ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూసేసరికి గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని వీణ మృతి చెంది ఉండగా.. మంచం పక్కనే బాబు విగత జీవిగా పడి ఉన్నాడు. బాబును తలగడతో నొక్కి చంపేసి తర్వాత ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు సంఘటన స్థలంలో లభించిన వివరాలను బట్టి పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య కలహాల కారణంగానే వీణ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని చోడవరం పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలరాజు చెప్పారు. భర్త పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు వచ్చాక మిగతా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. భర్త ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


