35 ఎకరాల వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యే సుందరపు
వివాదాన్ని సెటిల్‌మెంట్ చేసిన సురేష్
అచ్యుతాపురం భూ వివాదంలో కోల్డ్ వార్
తన వాటా ఇవ్వాలన్న ఎమ్మెల్యే నేరుగా పవన్‌కు ఫిర్యాదు చేసిన సన్నిహితుడు సురేష్
కేబినెట్ మీటింగ్‌లో ప్రస్తావించడంతో పాటు నేరుగా ఎమ్మెల్యేకు వార్నింగ్
రూ.350 కోట్ల భూ వివాదంలో అధికారులు బలి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తనదాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన ఎమ్మెల్యేల దౌర్జన్యాలు స్పష్టంగా తెలిసొచ్చాయి. తన సన్నిహితుడు తలదూర్చిన భూ వ్యవహారంలోనూ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏకంగా స్థానిక తహసీల్దారు, సీఐలపై వేటు వేయడంతో పాటు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చే వరకు వ్యవహారం వెళ్లింది. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలోనూ సదరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించాల్సి వచ్చింది.
రూ.350 కోట్ల విలువచేసే 35 ఎకరాల భూ వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం బోగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 40/2, 30,31,39, 461/2,5,7, 477, 488, 490/1, 490/2, 52,54,56,60/2, 103, 112, 113, 114/3లోని 35 ఎకరాలకుపైగా ఉన్న భూ వ్యవహారంలో 1993 నుంచి పీఆర్‌ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తోంది.
అయితే, సదరు భూమిలోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండేందుకు కోర్టు నుంచి గతంలో ఆదేశాలు ఉన్నాయి. అనంతరం జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్‌లో పీఆర్‌ఎస్ నాయుడుకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే పీఆర్‌ఎస్ నాయుడుకు అనుకూలంగా వ్యవహరించేందుకు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో పీఆర్‌ఎస్ నాయుడు నేరుగా భూమిలోకి ప్రవేశించారు.
ఎమ్మెల్యేకు వార్నింగ్.. అధికారుల బదిలీ
తనతో సంబంధం లేకుండా నేరుగా సమస్యను పరిష్కరించుకోవడంపై కినుక వహించిన ఎమ్మెల్యే స్థానిక తహశీల్దారుతో పాటు సీఐపై ఒత్తిడి తెచ్చి.. సివిల్ వివాదాన్ని కాస్తా క్రిమినల్ వివాదంగా మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. నాయుడుకు అనుకూలంగా పవన్ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించారని తెలుస్తోంది. అయితే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాత్రం తన వాటా దక్కాల్సిందేనంటూ స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలున్నాయి.
సురేష్ ఈ విషయాన్ని పవన్‌కు చేరవేశారు. దీంతో పవన్.. సదరు ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఇద్దరు అధికారులను బదిలీ చేయించారు. అంటే తన సన్నిహితుడు తల దూర్చిన భూ వివాదంలోనే తన ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏ మేరకు వీరి ఆగడాలు ఉన్నాయనేది పవన్‌కు తెలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేబినెట్‌లో పవన్ ఈ విషయమై సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించడం ఏమిటంటూ సదరు ఎమ్మెల్యే వర్గీయులు వాపోతున్నారు.
అసలు పవన్ సన్నిహితుడికి తమ నియోజకవర్గంలోని భూ వివాదంతో పనేమిటంటూ వారు మండిపడుతున్నట్లు సమాచారం. తన సన్నిహితుడు భూ వివాదంలో తల దూర్చిన విషయాన్ని మరుగునపెట్టి, కేవలం తమ నేతపై మాత్రమే నింద వేయడం సరికాదంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల ఆగడాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలతోపాటు వారి సోదరులు, బంధువులు, పీఏల ఆగడాలు మితిమీరాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


