మాఫియా
పరిశ్రమల్లో వినియోగించే సాల్వెంట్‌లో రసాయనాలు కలిపి
నగరంలో విచ్చలవిడిగా విక్రయాలు
పెందుర్తిలో బయటపడిన
అక్రమ వ్యవహారం
అధికారుల మొక్కుబడి తనిఖీలు
నగరంలో మిక్స్‌డ్ సాల్వెంట్
మహారాణిపేట: నగర శివారు ప్రాంతాల్లో అనధికార మిక్స్‌డ్ సాల్వెంట్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించాల్సిన రసాయనాలను వాహనాలకు వాడే ఇంధనంగా మార్చి విక్రయిస్తున్నా, అడ్డుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి వంటి శివారు ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం అడ్డుఅదుపూ లేకుండా విస్తరించింది.
హైదరాబాద్, చైన్నె కేంద్రంగా పనిచేసే కొన్ని ముఠాలు వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు ఈ మిక్స్‌డ్ సాల్వెంట్‌ను కొనుగోలు చేస్తున్నాయి. దానికి మరికొన్ని రసాయనాలు కలిపి ‘ఇండస్ట్రియల్ డీజిల్’ అనే ముసుగులో విక్రయిస్తున్నాయి. సాధారణ డీజిల్ ధర కంటే తక్కువగా లభిస్తుండటంతో వాహనదారులు కూడా దీనివల్ల కలిగే ప్రమాదాలను ముందే ఊహించినప్పటికీ, ఆర్థిక లాభం కోసం వీటిని పిలిపించుకుని మరీ ట్యాంకుల్లో నింపుకుంటున్నారు. ఫార్మా, కెమికల్, పాలిమర్ వంటి పరిశ్రమల్లో రసాయనాల విభజన కోసం మాత్రమే వాడాల్సిన ఈ సాల్వెంట్‌ను వాహనాలకు వాడటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. అంతేకాకుండా ఇలాంటి కల్తీ ఇంధనం వల్ల వాహనాల ఇంజన్ భాగాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యవహారం వెనుక భారీ నెట్‌వర్క్
ఈ వ్యవహారం వెనుక భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మిక్స్‌డ్ సాల్వెంట్ అమ్మకాలు జరపాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి. ఏటా అవసరమైన కోటా కోసం పౌరసరఫరాల శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ ఫైలు జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టర్‌కు చేరి, తుది అనుమతి లభించిన తర్వాతే క్రయవిక్రయాలు జరగాలి. విశాఖలో మాత్రం ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు. ఆనందపురం శివారులో నిరంతరం ఒక ట్యాంకర్‌ను సిద్ధంగా ఉంచి, అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
కారణంగానే..
ఇంత జరుగుతున్నా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ‘మామూళ్ల’ మత్తు ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం మొక్కుబడి చర్యగా ఇటీవల పెందుర్తిలో విజిలెన్స్ అధికారులు ఒక ట్యాంకర్‌ను పట్టుకుని, 26,277 లీటర్ల సాల్వెంట్‌ను సీజ్ చేసి సివిల్ సప్లైస్ ద్వారా 6–ఏ కేసు నమోదు చేశారు. అయితే ఇది కేవలం కంటితుడుపు చర్యేనని, అసలు దారిమళ్లింపుదారులు మాత్రం స్వేచ్ఛగా వ్యాపారాన్ని మూడు ట్యాంకర్లు, ఆరు డ్రమ్ముల చందంగా కొనసాగిస్తు న్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా, చమురు సంస్థలు సైతం మౌనం దాల్చడం వెనుక ఉన్న మర్మమేమిటో అధికారులకే తెలియాలి.
ఇండస్ట్రియల్ డీజిల్ తయారీ


