చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, భద్రతకు పటిష్ట చర్యలు
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: జిల్లాలో బాలల సంక్షేమం, రక్షణ , భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కమిటీల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల ప్రభావం నుంచి పిల్లలను రక్షించాలని, డ్రాప్‌ఔట్‌లను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని స్పష్టం చేశారు. బాలల సంరక్షణ గృహాల్లో మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించాలని ఆదేశిస్తూ, సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు.బాల, బాలిక సంరక్షణ గృహాలను పక్కాగా నిర్వహించాలని, వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు సూచించారు. పిల్లలకు ఆరోగ్యకర ఆహారం అందించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవలందించాలని చెప్పారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ రామలక్ష్మి శాఖాపరమైన అంశాలను వివరించారు. సమావేశాశంలో మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, జువైనెల్ వెల్ఫేర్ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ కేర్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


