భూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్’
మహారాణిపేట: సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ‘రెవెన్యూ క్లినిక్’లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వెల్లడించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)తో పాటు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకుని అధికారులు పని చేయాలని, ఈ క్లినిక్‌ల ద్వారా దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో పరిశీలించి సమాధానం చెప్పడం వల్ల వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్లినిక్‌ల పనితీరును ఇకపై ప్రతి వారం జేసీతో కలిసి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా దరఖాస్తులు నింపేందుకు సహాయకులను నియమించడమే కాకుండా, ఫిర్యాదుదారులు అధికారుల ఎదుట కూర్చుని ప్రశాంతంగా సమస్యలు వివరించుకునేలా కుర్చీలు, ఇతర వసతులు కల్పించారు. సోమవారం జరిగిన ఈ సదస్సులో సాధారణ పీజీఆర్‌ఎస్‌కు 262 వినతులు రాగా, రెవెన్యూ క్లినిక్‌కు 72 ఫిర్యాదులు అందాయి.
వీటిలో ప్రధానంగా ప్రభుత్వ, జిరాయితీ భూముల ఆక్రమణలు, అసైన్‌మెంట్ అంశాలు, జీవో 296 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ, 22–ఏ జాబితా నుంచి తొలగింపు వంటి సమస్యలు ఉన్నాయి. ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితుల వినతులను స్వీకరించారు. పెన్షన్ల కోసం ఎక్కువ మంది దివ్యాంగులు తరలివచ్చారు.
భూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్’


