సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ప్రయోగాన్ని 2026 జనవరి 5న గాని లేదా 10న నిర్వహించేందుకు సిద్ధం చేస్తోంది. ఈ నెల 26న ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహం షార్ కేంద్రానికి చేరుకుంది. క్లీన్ రూమ్‌లో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి రాకెట్‌కు అనుసంధానం చేయనున్నారు.
షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్ (ఫిఫ్)లో నాలుగు దశల పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాకెట్ అనుసంధానం తరువాత ఫిఫ్ నుంచి ఎంఎస్‌టీకి తరలించి అక్కడ ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపబోతున్నారు.
రాకెట్ ఆఖరి దశ అయిన పీఎస్–4 దశతో స్పెయిన్‌కి చెందిన స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ ఫారాడైమ్‌తో ప్రయోగాత్మకంగా ఓ పరీక్షను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. 25 కిలోల బరువైన కెస్ట్రెల్ ఇనీషియల్ డిమాన్‌్రస్టేటర్ (కేఐడీ) అనే క్యాప్సూల్స్‌ను పీఎస్–4 ద్వారా తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ ఫసిఫిక్ మహా సముద్రంలో ఒక స్పాష్ డౌన్ జోన్‌ను గుర్తించారు. దీంతో పాటు ఇందులో 18 పేలోడ్స్‌ను కూడా పంపిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.


