రాష్ట్రంలో పూర్తిగా అదుపుతప్పిన శాంతిభద్రతలు
స్పష్టం చేసిన పోలీసు శాఖ వార్షిక నివేదిక
ఫలించని కనికట్టుయత్నం
తిరుమలకు లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టమన్న డీజీపీ గుప్తా
మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదంటూ పవన్‌కళ్యాణ్‌కు కౌంటర్
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో రాష్ట్రం దాడులు, దౌర్జన్యాలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా భౌతికదాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2025 సంవత్సరంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరిస్తూ పోలీసు శాఖ వార్షిక నివేదికను సోమవారం డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అంతా బాగుందని చెప్పేందుకు గణాంకాలతో కనికట్టు చేసేందుకు ఆ నివేదికలో యత్నించారు. కానీ ఎంతగా దాచాలన్నా పోలీసు శాఖ వైఫల్యం మాత్రం బట్టబయలైంది. 2024తో పోలిస్తే 2025లో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతోపాటు ఆర్థిక నేరాలు పెరిగాయని ఆ నివేదికే స్పష్టం చేసింది.
పూర్తిగా అదుపుతప్పిన శాంతిభద్రతలు
టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చాలావరకు కేసులు నమోదు చేయడం లేదు. అయినా సరే 2025లో దాడులు, దౌర్జన్యాల కేసుల సంఖ్య పెరగడం గమనార్హం.
బాధితుల ఫిర్యాదులు అన్నింటిపైనా విచారణ చేసి కేసులు నమోదు చేసి ఉంటే రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి మరింతగా వెల్లడయ్యేది. రాష్ట్రవ్యాప్తంగా 2024లో దాడులు, దౌర్జన్యాల కేసులు 137 నమోదు కాగా... 2025లో ఆ సంఖ్య 146కు పెరిగింది. భౌతిక దాడుల కేసులు 6.6శాతం పెరిగినట్టు పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని అంతం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. 2024లో 1,403 హత్యాయత్నం కేసులు నమోదు కాగా... 2025లో హత్యాయత్నం కేసులు 1,566కు పెరగడం గమనార్హం. హత్యాయత్నం కేసులు 11.6 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.
భారీగా పెరిగిన ఆర్థిక నేరాలు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక నేరాలు అమాంతంగా పెరిగాయి. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్న పోలీసు పెద్దలు.. రాష్ట్రంలో ఆర్థిక నేరాల అదుపుపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. 2024లో 7,667 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా... 2025లో ఆ కేసుల సంఖ్య 8,034కు పెరిగింది. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు 4.78 శాతం పెరిగాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక పగటిపూట దొంగతనాలు కూడా పెరిగాయి. 2024లో 824 కేసులు నమోదు కాగా, 2025లో ఆ కేసుల సంఖ్య 836కు చేరింది.
లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం
⇒ మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదు
⇒ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలకు డీజీపీ కౌంటర్
‘తిరుపతికి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం సాధ్యమయ్యేపనా... వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల–తిరుపతిలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాటపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... లక్షల్లో భక్తులు వస్తుంటే భద్రత కల్పించడం, తగిన ఏర్పాట్లు చేయడం పూర్తిగా సాధ్యం కాదని డీజీపీ బదులిచ్చారు. అందుకు చాలా కారణాలు ఉంటాయని, పోలీసుల వైఫల్యంగానే చూడకూడదన్నారు. ఇక భద్రత కోసం మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను డీజీపీ గుప్తా వ్యంగ్యంగా తిప్పికొట్టారు.
‘మహిళా భద్రతలో పోలీసు వైఫల్యం గురించి జనరలైజ్ చేసి చెప్పడం సరి కాదు. నిర్దిష్టంగా చెప్పాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నేరాలను కట్టడి చేస్తున్నామని చెప్పారు. 2024లో రాష్ట్రంలో 1,10,193 కేసులు నమోదు కాగా, 2025లో 1,03,397 కేసులకు తగ్గాయని తెలిపారు. నేరాలు 6 శాతం తగ్గాయన్నారు. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025లో 153 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. త్వరలో ఐపీఎస్ అధికారుల జాతీయ సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐజీలు శ్రీకాంత్, రవికృష్ణ, పాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.


