
- 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతా ఏపీ వైపు చూసింది
- ఒకేసారి ఏకంగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కల్పన
- 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ఉన్న ఊళ్లోనే ప్రభుత్వ సేవలు
- ప్రతి 50–100 ఇళ్లకు ఓ వలంటీర్ ద్వారా ఇంటి వద్దకే పథకాలు
- కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్ర రూపు రేఖలు మార్చేలా విప్లవాత్మక నిర్ణయాలు
- గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు
- చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలవుతున్నా హామీలకు దిక్కులేదు
- అరకొర డీఎస్సీ నియామకాలు, పరీక్షల నిర్వహణలో ఆద్యంతం అవకతవకలే
- హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు లేవు.. కనీసం భృతి కూడా కరువే
- కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, పరీక్షలు పూర్తి చేసింది గత ప్రభుత్వమే
- ఆ 6,100 ఉద్యోగాలు తన ఘనతగా చెప్పుకుంటున్న బాబు.. గత ప్రభుత్వంలోనే డీఎస్సీ నోటిఫికేషన్.. వాటిపై న్యాయ
- వివాదాలు రేకెత్తించిన కూటమి సర్కారు
- అప్పట్లోనే ముందుకొచ్చిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, రిలయన్స్ సీబీజీ, రెన్యూ, షిర్డీసాయి తదితర సంస్థలు
- ఆ యూనిట్లు ప్రారంభం కాకుండానే 3.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్లు బాబు ప్రకటన
- జాబ్‌మేళాలతో రుణ రికవరీ, డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు కూడా బాబు ఘనతేనట!
సాక్షి, అమరావతి : గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతటా రాష్ట్రం వైపు చూసిన పరిస్థితి.. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వపరిపాలనను సాకారం చేసిన రోజది. ప్రజలకు ఉన్న ఊళ్లోనే ప్రభుత్వ సేవలు అందించేలా చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా, కనీ వినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన రోజది. ఏకంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాటు చేశారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంత మంది ఉద్యోగులను నియమించడం దేశ చరత్రలోనే జరగలేదు.
చిన్న ఆరోపణ కూడా లేకుండా, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక్కరి చొప్పున వలంటీర్లను నియమించారు. తద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకెళ్లారు. ఈ విధానం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్ర రూపు రేఖలు మార్చే పాలనతో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా వివిధ ప్రభుత్వ శాఖలలో ఏకంగా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడం మరో రికార్డు. కాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కనీసం పదో తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేక పోయిందని, డీఎస్సీ అంతా అవకతవకలేనని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
నేడు అంతా రివర్స్
» రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల వేళ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏ ఒక్కటీ ఇవ్వకపోగా.. గత ప్రభుత్వ కృషిని సైతం తన ఘనతగా చెప్పుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై గత 15 నెలలుగా ఊకదంపుడు ప్రసంగాలు, కాకి లెక్కలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా నిస్సిగ్గుగా అవే అబద్ధాలు వల్లె వేశారు.
» తాను ఏకంగా 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్లు కళ్లార్పకుండా బడాయిలు చెప్పుకోవడంపై అందరూ విస్తుపోతున్నారు. ఇంతవరకూ కనీసం ఉత్పత్తి కూడా ప్రారంభించని కంపెనీల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో 3,48,891 ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు.
» గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న విశాఖ ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీబీజీ ప్లాంట్లు, రెన్యూ, మిట్టల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, అదానీ, షిర్డీసాయి, గ్రీన్‌కో అమ్మోనియా తదితర ప్రాజెక్టులన్నీ తన ఖాతాలో వేసుకున్నారు. వాటిని రాష్ట్రానికి తామే తెచ్చినట్లుగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
» వైఎస్సార్‌సీపీ హయాంలో 2023లో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖేష్ అంబానీ, ఆదిత్య మిట్టల్ లాంటి పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే అవి ఇంకా ఉత్పత్తి ప్రారంభించక ముందే వాటి ద్వారా 3.48 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చంద్రబాబు సర్కారు చెప్పుకోవడంపై ప్రజలు, పారిర్రామికవేత్తలు విస్తుపోతున్నారు.
ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత ప్రభుత్వంలోనే..
» కూటమి సర్కారు వచ్చాక ఇంత వరకు ఏ ఒక్కరూ కొత్తగా అధికారికంగా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా విధుల్లో చేరకపోయినా 15 నెలల్లో 31,134 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నిజానికి ఇందులో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్, ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్స్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. దీనిపై కొంత మంది కోర్టుకు వెళ్లడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కారం కావడంతో కూటమి ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు మాత్రమే జారీ చేసింది.
» గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలను సైతం చంద్రబాబు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇదే రీతిలో గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కూటమి సర్కారు పరీక్షల నిర్వహణలో న్యాయ వివాదాలు రేకెత్తిస్తూ సుదీర్ఘ కాలయాపన చేసింది. ప్రస్తుతం ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఇక గత ప్రభుత్వం వివిధ విభాగాల్లో నియమించిన ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన చంద్రబాబు సర్కారు.. కొత్త వారిని నియమించుకుని వాటిని కొత్త ఉద్యోగాలుగా చిత్రీకరిస్తోంది.
స్విగ్గీ, జొమాటో, డోర్ డెలివరీ జాబ్స్..
» జాబ్‌మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకున్నారు. జాబ్‌మేళాల జాబితా పరిశీలిస్తే అత్యధికంగా బ్యాంకులు, రుణ రికవరీ ఏజెంట్లు, బీమా ఏజెంట్లు, జొమాటో, స్విగ్గీ, అమెజాన్, బ్లింకిట్ లాంటి డోర్ డెలివరీ జాబ్స్, ఫార్మసీ షాపుల్లో ఉద్యోగాలే అత్యధికంగా ఉన్నాయి. తాత్కాలికంగా ఉపాధి కల్పించే వాటిని కూడా ప్రభుత్వం తాము కొత్తగా ఉద్యోగాలు ఇచి్చనట్లు ప్రచారం చేసుకోవడం చూసి విస్తుపోతున్నారు.
» చివరికి చంద్రబాబు సర్కారు ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే.. ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులు కొందరు ఏపీ నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పని చేస్తుంటే వారిని కూడా తమ ఖాతాలో వేసుకుని 5,500 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉపాధి కల్పించినట్లు ఘనంగా చెప్పుకోవడం.