టీడీపీ నేత గోదాం నుంచే గో మాంసం ప్యాకింగ్‌! | Nearly 200 tons of beef seized from TDP leaders godown | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత గోదాం నుంచే గో మాంసం ప్యాకింగ్‌!

Nov 12 2025 5:17 AM | Updated on Nov 12 2025 5:17 AM

Nearly 200 tons of beef seized from TDP leaders godown

దీన్ని డైవర్ట్‌ చేసేందుకే తిరుమల లడ్డూ వ్యవహారం మళ్లీ తెరపైకి! 

అసలు 189 టన్నుల గో మాంసం ఎక్కడికి తరలిస్తున్నట్లు? 

ప్రతి నెలా విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీలు ఎగుమతి! 

6 శాంపిల్స్‌ను అక్టోబర్‌ 3న ఫోరెన్సిక్‌కు పంపిన పశుసంవర్థక శాఖ 

మూడింటిలో నిషేధిత గో మాంసం ఉన్నట్లు గుర్తింపు 

మిగిలినవాటిలో రెండు ఎద్దువి, ఒకటి గేదె మాంసం! 

శొంఠ్యాంలోని కోల్డ్‌స్టోరేజీలో దొరికిన 9,921 బాక్సులు 

బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు గుప్తా గోడౌన్‌గా గుర్తింపు 

డీఆర్‌ఐకి అప్పగించకుండా అడ్డుకుంటున్న సర్కారు 

సనాతని పవన్‌... నోరెత్తరేం అంటున్న హిందూ సంఘాలు  

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతకు చెందిన గోదాంలో దాదాపు 200 టన్నుల గో మాంసం పట్టుబడిన సంచలన కేసు నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు సర్కా­రు మళ్లీ తెరపైకి తెస్తోంది. లడ్డూ నెయ్యి కల్తీ అంటూ అనవసర రాద్ధాంతానికి దిగుతూ... గో మాంసం కేసును నీరుగార్చేందుకు విశ్వ ప్రయ­త్నా­లు చే­స్తోంది. 

బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రధాన అను­చరుడు, టీడీపీ కీలక నేత సుబ్రహ్మణ్య గుప్తాకు చెందిన విశాఖ శివారు శొంఠ్యాంలోని శ్రీ మిత్ర మె­రైన్‌ ఏజెన్సీ కోల్డ్‌ స్టోరేజీలోనే గోమాంసం దొరకడంతో చంద్రబాబు సర్కారు ఉలిక్కిపడింది. అంతే, ఆ వెంటనే అసలు ఏమీ లేని కల్తీ నెయ్యి కేసును మళ్లీ  తెర­పైకి తెచ్చింది. 

ఓవైపు విశాఖ గోదాం నుంచి అరబ్‌ దేశాలకు ఎగుమతికి సిద్ధం చేసిన 189 టన్ను­ల గో మాంసం దొరికిన కేసులో విచారణను జా­ప్యం చే­స్తూ... మరోవైపు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలి­జె­న్స్‌కు కూడా దర్యాప్తు ఇవ్వకుండా అడ్డుకుంటోంది. వాస్తవా­నికి నెల  నుంచి సాగుతున్న ఈ గో మాంసం సీజ్‌ కేసులో విస్తుపోయే వాస్తవాలున్నాయి.

అసలు ఏం జరిగిందంటే?
అక్టోబరు 3న శ్రీ మిత్ర కోల్డ్‌ స్టోరేజీలో నిషేధిత పశుమాంసం ఉన్నట్లు విజిలెన్స్‌కు సమాచారం అందగా పశు సంవర్థక శాఖకు సమాచారం ఇచ్చి శాంపి­ల్స్‌ తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధి­కారులు ఆరు శాంపిల్స్‌ తీసి అక్టోబరు 5న ఫోరెన్సి­క్‌కు పంపారు. గత నెలాఖరునే మెయిల్‌ ద్వారా రిపోర్టులు ఇచ్చారు. ఆరు శాంపిళ్లలో మూడింట్లో నిషేధిత గో మాంసం ఉన్నట్లుగా వెల్లడైంది. 

మిగిలిన రెండింట్లో ఎద్దు మాంసం, ఒకదాంట్లో గేదె మాంసం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో నిషేధిత గో మాంసం ఉందని విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 3న పశు సంవర్థక శాఖ, విజిలెన్స్, ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి విశాఖ ఆనందపురం పోలీసులు సోదాలు చేశారు. అనుమతుల్లేని 189 టన్నుల గో మాంసం ఇక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. 

దీన్ని 9,921 కంటైనింగ్‌ బాక్సుల్లో ప్యాక్‌ చేసి నిల్వ ఉంచారు. ఏ పత్రాలు లేకపోవడంతో కోల్డ్‌ స్టోరేజ్‌ మేనేజర్‌ అబ్దుల్‌ గఫూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోమాంసాన్ని సీజ్‌ చేశారు. ఇక ఇక్కడినుంచి చంద్రబాబు ప్రభుత్వం డ్రామాలు మొదలు పెట్టింది.

ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని..
అక్టోబరు 3వ తేదీన దాడులు జరిగి సీజ్‌ చేస్తే... 4వ తేదీ సాయంత్రం వరకు సమాచారం బయటకు రా­లే­దు. ఓవైపు సనాతన ధర్మం అంటూ హడావుడి చేస్తుండగా, రాష్ట్ర చరిత్రలోనే భారీఎత్తున నిషేధిత గోమాంసం పట్టుబడడంతో చెడ్డ పేరు వస్తుందని టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. బయ­టి­కి రాకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ, స్థాని­కులు కొందరు శొంఠ్యాంలో గోమాంసం పట్టుబడిందని ప్రచారం చేయడంతో ఒక్కసారిగా గుప్పుమంది. 

చేసేదిలేక...4వ తేదీన పోలీసులు విషయాలను బహిర్గతం చేసి కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రిజిస్టర్డ్‌ కంపెనీ మెష్‌ ఓవర్‌సీస్‌ సంస్థ ఈ పశుమాంసాన్ని  తీసుకొచ్చినట్లు గుర్తించి అక్కడి డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకు­న్నారు. 8వ తేదీన పోస్టు ద్వారా ఫోరెన్సిక్‌ నివేదికలు పశుసంవర్థక శాఖకు చేరగా 10న ఆనందపురం పోలీస్‌స్టేషన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.

గేదె మాంసానికి అనుమతి.. ఎగుమతి గో మాంసం 
సుబ్రహ్మణ్య గుప్తా గేదె మాంసం అని చెప్పి అను­మ­తులు పొంది కొంతకాలంగా అనధికారికంగా ని­షేదిత గో మాంసం నిల్వ చేసి విదేశాలకు ఎగుమ­తి చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన గో మాంసం సె­ప్టెంబర్‌ 24న ప్యాక్‌ అయి విశాఖ చేరుకుంది. ఇక్కడి నుంచి యూఏఈకి చెందిన సాదియా ఫుడ్స్‌ సంస్థతో కలిసి యూఏఈ, ఖతర్, కువైట్, బహ్ర­యిన్, సౌదీ అరేబియా, ఒమన్, వియత్నాంకు ఎగు­మ­తి చేస్తుంటారు. కొంతకాలంగా ఈ అక్రమ వ్యా­పా­రం జరుగుతోందని విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది.

గో మాంసం కేసును తప్పుదారి పట్టించేందుకు కల్తీ నెయ్యి వ్యవహారం
హిందుత్వాన్ని తామే ఉద్ధరిస్తున్నామంటూ... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వా­నికి గోమాంసం పట్టుబడడం తీవ్ర సంకటంగా మారింది. దీంతో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. భారీగా గోమాంసం పట్టుకున్నారన్న విషయం తెలిస్తే పరువు పోతుందని.. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం పేరుతో మరోమారు తప్పుడు ఆరోప­ణలు మొదలు పెట్టారు. మరోవైపు.. గోమాంసం కేసును తప్పుదారి పట్టించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంలో విజిలెన్స్‌ విచారణకు బ్రేక్‌ వేసింది. 

మరోవైపు.. భారీగా నిషేదిత గోమాంసం.. కంటైనర్ల ద్వారా పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకేనని తెలుసుకున్న డీఆర్‌ఐ తమకు కేసును అప్ప­గించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరగా తమ పోలీసులే విచారణ చేస్తారని వారిని అడ్డుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు.. గోడౌన్‌ యజమాని అయిన టీడీపీ నేతను తప్పించి.. కేవలం మెష్‌ ఓవర్‌సీస్‌ సంస్థదే తప్పు అన్నట్లుగా చిత్రీకరించి.. కేసుని క్లోజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నన్నెందుకు అడుగుతారంటున్న సీపీ.!
రాష్ట్రంలో ఇంత భారీగా గోమాంసం పట్టుబడి సంచలనం సృష్టించిన కేసు విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయంపై విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీని ‘సాక్షి’ ప్రశ్నించగా.. సీఐని అడగమని బదులిచ్చారు. సీఐ స్పందించడం లేదని చెప్పగా.. ఏసీపీని.. ఆయనా కాదంటే   డీసీపీని అడగండి.. నన్నెందుకు అడుగుతారంటూ మాట దాటవేశారు. 

ఇదంతా చూస్తుంటే కేసు విచారణకు బ్రేక్‌ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి తెస్తున్నదో అర్థమవుతోంది. ఆనందపురం సీఐ వాసునాయుడిని అడిగితే.. ఇంతకంటే ప్రాధాన్యమున్న కేసులు, ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి.. వాటిపైనే దృష్టిసారించామని, ఆ తర్వాతే దీనిగురించి అని చెప్పడం గమనార్హం.

మైనార్టీలను అడ్డం పెట్టుకుని...
విశాఖలోని కోల్డ్‌ స్టోరేజీని సుబ్రహ్మణ్యగుప్తా ఉరఫ్‌ చిన్నా ఎనిమిదేళ్లుగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రొయ్యల ఎగుమతులు చేసే సమయంలో ప్రస్తుత బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రమంగా నష్టాలు రావడంతో వర్మ తప్పుకొన్నారు. ఇతర వ్యాపారాలను సుబ్రహ్మణ్యగుప్తా కొనసాగిస్తున్నారు. 

బాపట్ల ఇస్లాంపేటకు చెందిన మైనార్టీల పేరుతో పశుమాంసం ఎగుమతులకు అనుమతులు పొందారు. తొలుత గల్ఫ్‌ దేశాలకు ఎద్దు, గేదె మాంసం ఎగుమతి చేసేవారు. నిషేధిత గో మాంసం ఎగుమతితో లాభాలు బాగా వస్తాయని అక్రమంగా ఎగుమతులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గుప్తాకు టీడీపీ నేతల మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకుల్లో భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు.

సీజ్‌ ద కోల్డ్‌ స్టోరేజ్‌ అని పవన్‌ ఎందుకు చెప్పలేదు?
గోమాంసం అక్రమరవాణా.. ప్రత్య­క్షంగా, పరోక్షంగా రాజకీయ నాయ­కుల అండదండలతోనే నడుస్తోంది. ఎవరి వాటా వాళ్లకు అందుతోంది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడా లేని­విధంగా.. విశాఖలో స్వయంభూ దేవాలయాలకు దగ్గర్లో దొరికినా స్పందించ­లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఇదంతా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హిందువుల మనోభావాల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. 

గోమాంసం పట్టుబడడంపై ఇంకా స్పందించడం లేదంటే ఏమను­కోవాలి. పశుసంవర్థక శాఖ మంత్రి, హోం మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు? సనాతన ధర్మం అని చెప్పే పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు నోరు విప్పడం లేదు.? బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే సీజ్‌ ద షిప్‌ అని చెప్పిన ఆయన... సీజ్‌ ద కోల్డ్‌ స్టోరేజ్‌ అని ఎందుకు అనలేదు.? ప్రభుత్వం ఏమీ మాట్లాడనివ్వడం లేదా? – విజయశంకర్‌ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్‌ కో కన్వీనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement