స్టీల్‌ ప్లాంట్‌ ప్యాకేజీ వెనుక మతలబు ఏంటి?: అమర్నాథ్‌ | YSRCP Gudivada Amarnath Key Comments Over Visakha Steel Plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ ప్యాకేజీ వెనుక మతలబు ఏంటి?: అమర్నాథ్‌

Jan 18 2025 12:40 PM | Updated on Jan 18 2025 1:34 PM

YSRCP Gudivada Amarnath Key Comments Over Visakha Steel Plant

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్‌ జగన్‌ వ్యతిరేకమే అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. వైఎస్సార్‌సీపీ వల్లే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగింది. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు అండగా వైఎ‍స్సార్‌సీపీ నిలబడిందని అమర్నథ్‌ తెలిపారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ కేవలం ఆక్సిజన్‌లా పని చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకం. వైఎస్సార్‌సీపీ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఈ మాట స్వయంగా కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను  వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది అని మంత్రి చెప్పారు. కార్మికులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలబడింది.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాము. రూ.11,400కోట్ల ప్యాకేజీలో గతంలో ఇచ్చిన 1500 కోట్లు మినహాయించి మిగిలిన రూ.9800కోట్లు ఇస్తున్నారని మాకు సమాచారం ఉంది. ప్రధాని మోదీ సభలో ఎందుకు ప్యాకేజీ ప్రకటించలేదు. మీ ప్యాకేజీ వెనుక మతలబు ఏంటి?. స్టీల్ ప్లాంట్ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని ఉద్దేశ్యం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోలేదు.

కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అప్పులకే సరిపోతుంది. ప్లాంట్‌లో వీఆర్‌ఎస్‌ను ఎందుకు తీసుకువచ్చారు. 25వేల మందితో నడవాల్సిన ప్లాంట్ 10 వేల మందితో నడుస్తుంది. ఇంకా ఉద్యోగులను తొలగిస్తే ప్లాంట్ ఎలా నడుస్తుంది. స్టీల్ ప్లాంట్ ఎంతో సెంటిమెంట్‌తో ఏర్పడింది. 55వేల కోట్లు పన్నుల రూపంలో కట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్స్ పెడుతున్నాం. స్టీల్ ప్లాంట్‌కు ట్యాక్స్ హాలీడే ఇవ్వాలి. ప్లాంట్‌ను సేయిల్‌లో విలీనం చెయ్యాలి. సొంతంగా గనులు కేటాయించాలి.

200ఏళ్లకు సరిపడే గనులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రాష్ట్రపతి పేరు మీద ఉన్న స్టీల్ ప్లాంట్ భూములు స్టీల్ ప్లాంట్ పేరు మీద మార్చాలి. కూటమి పాలన వచ్చిన తర్వాత కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులను తొలగించారు. అలెవెన్స్‌ కూడా ఇవ్వలేదు. పీఎఫ్‌ డబ్బులు వాడేశారు. ఇన్నీ చేసి.. ఎందుకు కూటమి నేతలు సంబురాలు చేసుకున్నారో అర్థం కాలేదు.  గతంలో కూడా అనేక ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీలు అందించాయి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement