‘లష్కరే’ కేంద్రం ధ్వంసం నిజమే! | Lashkar Muridke camp was one of the nine terror locations destroyed | Sakshi
Sakshi News home page

‘లష్కరే’ కేంద్రం ధ్వంసం నిజమే!

Sep 20 2025 6:23 AM | Updated on Sep 20 2025 6:23 AM

Lashkar Muridke camp was one of the nine terror locations destroyed

ఆపరేషన్‌ సిందూర్‌తో మాకు భారీ నష్టం

లష్కరే తోయిబా కమాండర్‌ ఖాసిం అంగీకారం  

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీ కారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఉగ్రవాద సంస్థలు కకావికలమయ్యాయి. తమకు జరిగిన నష్టంపై నోరువిప్పుతున్నాయి. భారత సైన్యం దాడులతో జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ కుటుంబం ముక్కలైందని ఆ సంస్థ టాప్‌ కమాండర్‌ మసూద్‌ ఇల్యాస్‌ కశ్మీరీ ఇప్పటికే అంగీకరించాడు. వైమానిక దాడుల్లో బహవల్పూర్‌ స్థావరం దెబ్బతిన్నదని వెల్లడించాడు.

 పాకిస్తాన్‌లోని మరో ముష్కర ముఠా లష్కరే తోయిబా కమాండర్‌ ఖాసిం కూడా తాజాగా స్పందించాడు. ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లిందని, తమ ప్రధాన కేంద్రం ‘మర్కజ్‌ తయిబా’ ధ్వంసమైందని వెల్లడించాడు. మే 7న జరిగిన దాడుల్లో మురిద్కే పట్టణంలోని ఈ కేంద్రం నామరూపాల్లేకుండా పోవడంతో మళ్లీ నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ధ్వంసమైన భవనం కంటే.. ఈసారి భగవంతుడి దయతో పెద్ద భవనం నిర్మిస్తున్నామని తెలియజేశాడు.

 మర్కజ్‌ తయిబా శిథిలాలపై నిలబడి ఖాసిం మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాణంలో ఉన్న భవనం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. పాక్‌ భూభాగంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని షేక్‌పురా జిల్లాలో మురిద్కే పట్టణం ఉంది. మర్కజ్‌ తయిబాలో ముజాహిదీన్‌లు(ఉగ్రవాదులు), తలాబాలకు(విద్యార్థులు) శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని పాకిస్తాన్‌ అధికారులు చెబుతున్నారు.  

దౌరా–ఇ–సుఫాలో  చేరండి  
మర్కజ్‌ తయిబాలో దౌరా–ఇ–సుఫాలో చేరాలంటూ పాకిస్తాన్‌ యువతకు లష్కరే తోయిబా ఖాసిం పిలుపునిస్తున్న మరో వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. దౌరా–ఇ–సుఫా అనేది ఉగ్రవాద శిక్షణ కార్యక్రమం. ఇక్కడ జిహాదీ శిక్షణలో భాగంగా మత విద్య కూడా బోధిస్తారు. తమ స్థావరం పునర్నిర్మాణానికి పాకిస్తాన్‌ ప్రభుత్వం, సైన్యం సహకరిస్తున్నాయని, నిధులు అందజేస్తున్నాయని లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా కసూరీ వెల్లడించడం గమనార్హం. లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాన్ని మళ్లీ నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు సైతం ధ్రువీకరించాయి. 2026 ఫిబ్రవరి 5న జరిగే  ‘కశ్మీర్‌ సంఘీభావ దినం’ నాటికి కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, లాంఛనంగా ప్రారంభించాలని లష్కరే తోయిబా ముఠా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.  

ఖైబర్‌ పఖ్తూంక్వాకు పాక్‌ ఉగ్రవాద సంస్థలు  
ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో కనీసం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంపై పాక్‌ ఉగ్రవాద సంస్థలు దృష్టిపెట్టాయి. తమ ప్రధాన కేంద్రాలను ఖైబర్‌ పఖ్తూంక్వా(పీకేపీ) ప్రావిన్స్‌కు తరలిస్తున్నారు. లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఖైబర్‌ పఖ్తూంక్వా అనేది ఎత్తయిన కొండలతో నిండిన శత్రుదుర్భేద్య ప్రాంతం. అఫ్గానిస్తాన్‌కు సమీపంలో ఉండడం ఉగ్రవాదులకు అనుకూలించే అంశం. జిహాదీ శక్తులకు ఇది ప్రధాన అడ్డా. భారత సైన్యం వైమానిక, క్షిపణి దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఖైబర్‌ పఖ్తూంక్వాకు తరలి వెళ్లడమే సరైన వ్యూహమని పాక్‌ ఉగ్రవాద సంస్థలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని తీర్మానించుకున్నట్లు సమాచారం.                  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement