breaking news
Qasim
-
కిందపడ్డ వ్యక్తిని దొంగ అనుకొని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తిని చేరదీయాల్సిందిబోయి.. పశువుల దొంగని కొట్టి చంపారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో పిలఖువా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాసీం(45), అతని స్నేహితుడు సమీయుద్దీన్ ఇద్దరు పశువుల ఉండే చోట ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. పశువుల పాకలోని గేదె, దూడను దొంగిలించేందుకు వచ్చారనే అనుమానంతో వారిద్దరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటనలో 45 ఏళ్ల ఖాసీం తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జనమంతా చుట్టుముట్టగా బాధితుడు ఖాసీం తీవ్రగాయాలతో దాహం వేస్తుందని నీళ్లు అడుగుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఆ వీడియో తమకు అందలేదని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 25 మంది స్థానికులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. -
ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే
ఖాసింపై కేసు ఎత్తివేయాలన్న కవులు, రచయితలు హైదరాబాద్: ప్రజాస్వామిక తెలంగాణ, విప్లవోద్యమం కోసం పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం కుట్ర కేసు పెట్టడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని విరసం నేత వరవరరావు అన్నారు. రచయితగా, సంపాదకుడిగా, ప్రొఫెసర్‌గా ప్రజల్లో పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వరవరరావు మాట్లాడుతూ... తెలంగాణలో భావ స్వేచ్ఛను దారుణంగా అణచివేస్తున్నారన్నారు. ఈ ప్రమాదాన్ని మొగ్గలోనే అరికట్టాలన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... తెలంగాణ అవతరించడానికి టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కారణం కాదన్నారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలుండటమే నేరమైతే, వారితో నాడు శాంతి చర్చలు జరిపిన ఐదుగురు మంత్రులు కూడా దేశ ద్రోహులు అవుతారని అన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత... ‘మా భావాలపై కత్తులు పెట్టకండి’ అన్నారు. అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువల కోసం ఎవరు మాట్లాడినా వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు. కొనదలిచిన వారిని కొనుక్కుంటున్నారు... కొనటానికి వీలు లేని వారిపై కేసులు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులపై ఆంధ్ర ప్రభుత్వం కూడా పెట్టని కేసులను తెలంగాణ ప్రభుత్వం పెడుతోందన్నారు. తెలంగాణ వ్యతిరేకులంతా మంత్రులయ్యారన్నారు. ప్రొఫెసర్ ఖాసిం మాట్లాడుతూ... తెలంగాణ కోసం పోరాడిన ప్రతి సమయంలోనూ మాపై కేసులు మోపారన్నారు. రచయిత నందిని సిధారెడ్డి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, ప్రజా కళామండలి కోటి తదితరులు పాల్గొన్నారు.