ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే | Qasim On Case democracy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే

Jan 24 2016 5:09 AM | Updated on Sep 3 2017 4:10 PM

ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే

ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే

ప్రజాస్వామిక తెలంగాణ, విప్లవోద్యమం కోసం పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం కుట్ర కేసు పెట్టడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని విరసం నేత వరవరరావు అన్నారు.

ఖాసింపై కేసు ఎత్తివేయాలన్న కవులు, రచయితలు
హైదరాబాద్: ప్రజాస్వామిక తెలంగాణ, విప్లవోద్యమం కోసం పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం కుట్ర కేసు పెట్టడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని విరసం నేత వరవరరావు అన్నారు. రచయితగా, సంపాదకుడిగా, ప్రొఫెసర్‌గా ప్రజల్లో పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.

బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వరవరరావు మాట్లాడుతూ... తెలంగాణలో భావ స్వేచ్ఛను దారుణంగా అణచివేస్తున్నారన్నారు. ఈ ప్రమాదాన్ని మొగ్గలోనే అరికట్టాలన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... తెలంగాణ అవతరించడానికి టీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే కారణం కాదన్నారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలుండటమే నేరమైతే, వారితో నాడు శాంతి చర్చలు జరిపిన ఐదుగురు మంత్రులు కూడా దేశ ద్రోహులు అవుతారని అన్నారు.

ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత... ‘మా భావాలపై కత్తులు పెట్టకండి’ అన్నారు. అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువల కోసం ఎవరు మాట్లాడినా వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు. కొనదలిచిన వారిని కొనుక్కుంటున్నారు... కొనటానికి వీలు లేని వారిపై కేసులు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులపై ఆంధ్ర ప్రభుత్వం కూడా పెట్టని కేసులను తెలంగాణ ప్రభుత్వం పెడుతోందన్నారు. తెలంగాణ వ్యతిరేకులంతా మంత్రులయ్యారన్నారు. ప్రొఫెసర్ ఖాసిం మాట్లాడుతూ... తెలంగాణ కోసం పోరాడిన ప్రతి సమయంలోనూ మాపై కేసులు మోపారన్నారు. రచయిత నందిని సిధారెడ్డి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, ప్రజా కళామండలి కోటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement