ప్రతిభకు పరాభవం | Injustice once again to the poets and artists of the state | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పరాభవం

Mar 19 2026 4:34 AM | Updated on Mar 19 2026 4:34 AM

Injustice once again to the poets and artists of the state

రాష్ట్రంలోని కవులు, కళాకారులకు మరోసారి అన్యాయం 

ఉగాది పురస్కారాల ఎంపికలో టీడీపీ కూటమి రాజకీయం

మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకే అవార్డులు 

ప్రకటించిన తరువాత జాబితాలో పేర్లు తొలగింపు 

ఎంపిక చేశాక అవార్డు స్వీకరణకు రావద్దని ఫోన్లు 

చంద్రబాబుపై ముక్తకంఠంతో విరుచుకుపడుతున్న సాహిత్యలోకం

సాక్షి, అమరావతి: తెలుగు సాహితీ రంగాన్ని సీఎం చంద్రబాబు ఘోరంగా అవమానించారు. కవులు, కళాకారులకు తీవ్ర అన్యాయం చేశారు. పండితులనే కనీస గౌరవం కూడా లేకుండా వారి మనోభావాలను దెబ్బతీశారు. అవార్డుకు ఎంపిక చేసి.. రాత్రికి రాత్రే వారి పేర్లను తొలగించేశారు. ఉదయం ఫోన్‌చేసి పురస్కార స్వీకరణకు రానవసరం లేదని కర్కశంగా చెప్పించారు. ముఖ్యంగా పురస్కార గ్రహీతల ఎంపికలో వారికి నచ్చిన వారికి కులాల ప్రాతిపదికన అవార్డులు పంచేశారు. 

ముస్లిం సామాజిక వర్గంలో ప్రముఖ రచయితలు ఉన్నప్పటికీ ఆ వర్గం నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా పురస్కారానికి ఎంపిక చేయలేదు. మహిళా కవులు, రచయితలకు కూడా కనీస ప్రాధాన్యత దక్కలేదు. ప్రతిభకంటే కులాలకు, రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయడాన్ని  సాహిత్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పరాభవ నామ సంవత్సరంలో తొలి పరాభవం తమకే జరిగిందంటూ కవులు, కళాకారులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.  

ఎంపిక చేసి రావద్దంటూ ఫోన్లు 
దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్‌ సతీష్ చందర్‌కు కళారత్న అవార్డు ప్రకటించి.. కుటుంబంతో సహా రావాలని, వారందరి వివరాలు కూడా తీసుకున్న కొద్ది గంటలకే ‘మీరు అవార్డు తీసుకోవడానికి రావద్దు. మీ పేరును జాబితా నుంచి తొలగించాం’ అని ఫోన్‌ చేసి ఆయనను చంద్రబాబు ప్రభుత్వం అవమానించింది. 

అదేవిధంగా కాకినాడలోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సాహిత్యవేత్త మధునాపంతుల సత్యనారాయణమూర్తికి సైతం ఇలాంటి పరాభవమే జరిగింది. ఉగాది పురస్కారం ఇస్తున్నట్టు ప్రకటించి, కనీసం ఆయనకు కారణం కూడా చెప్పకుండానే అవార్డు స్వీకరణకు రావద్దంటూ ఫోన్‌ చేసి చెప్పేశారు. అనకాపల్లికి చెందిన మినియేచర్‌ ఆర్టిస్ట్‌ గొట్టెం వెంకటేష్‌కు కూడా ఇదే అవమానం ఎదురైంది. 

ఎంపికలో రాజకీయం 
ఏటా కళ, సేవ, సాహిత్య, పత్రిక రంగాల్లో విశేష సేవలందించిన వారిని, నిష్ణాతులైన పండితులను ఉగాది పురస్కారాలతో సత్కరించడం ఆనవాయితీ. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఈ పురస్కారాలకు జరిగే ఎంపిక వివాదాస్పదంగా మారింది. ప్రతిభను చూసి చేయాల్సిన ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యం పెరిగింది. ఫలితంగా అర్హులకు అన్యాయం జరుగుతూనే ఉంది. 

గతేడాది కనీసం ఎంపిక జాబితాలో కూడా లేనివారు వేదికపై నగదు పురస్కారాలను అందుకుని వెళ్లిపోయారు. ఈ సారైనా పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని భావించి వివిధ రంగాలకు చెందిన దాదాపు 2 వేల మంది పురస్కారాలకు దరఖాస్తు చేశారు. 

ఇలా అలవాటైపోయింది ఈ ప్రభుత్వానికి.. 
ఉగాది వేడుకల సందర్భంగా సృజనాత్మక, సాంస్కృతిక శాఖ తయారు చేసిన ఆహ్వానపత్రమే తప్పుల తడకగా ఉంది. ప్రొటోకాల్‌ తెలియక పేర్లను తికమకగా ప్రచురించారు. పదవీ కాలం పూర్తయిన ఎమ్మెల్సీ పేర్లు వేసేశారు. అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదానంలో జరుగుతున్నట్టు ప్రచురించారు. తరువాత వేదికను తుమ్మలపల్లి కళాక్షేత్రానికి మార్చారు. తీరిగ్గా నాలుక్కరుచుకుని మళ్లీ కొత్త ఆహ్వాన పత్రాలు ముద్రిస్తున్నారు. మొన్నటికి మొన్న కందుకూరి ప్రతిష్టాత్మక అవార్డులు, నంది నాటకోత్సవాల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మళ్లీ గంటకే రద్దు చేశారు. 

నిన్న కళారత్న, ఉగాది పురస్కారాల జీవో విడుదల చేశారు. రాత్రికి రాత్రి మార్పులు చేర్పులు చేశారు. ప్రకటించిన పేర్లు తొలగించేశారు. దరఖాస్తు చేసిన వారిలో కళారత్న (హంస) పురస్కారాలకు 40 మందిని, ఉగాది పురస్కారాలకు 124 మందిని ప్రభుత్వం నియమించిన జంబో కమిటీ ఎంపిక చేసినట్టు మంగళవారం ప్రకటించింది. అయితే, రాత్రికి రాత్రి వీరిలో కొందరిని తొలగించారు. మరికొందరిని జత చేశారు. చివరకు కళారత్నకు 38 మంది, ఉగాది పురస్కారానికి 123 మంది అర్హులుగా తేల్చారు.  

అర్హులకు అన్యాయం 
విజయవాడ కృష్ణలంకలో 40 ఏళ్లుగా కూచిపూడి నాట్యానికి అంకితమైన ఓ నాట్యాచార్యుడు దరఖాస్తు చేసినా పురస్కారం ఇవ్వలేదు. కానీ.. కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ తన అనుచరులైన నలుగురికి అవార్డులు ఇచ్చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కమిటీలోని వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల మేరకు నచ్చని వారిని పక్కనపెట్టి.. కావాల్సిన వారిని పురస్కారాలకు ఎంపిక చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ను వదిలి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి అనేక విభాగాల్లో పురస్కారాలు ప్రకటించారు. ఈ మొత్తం ఎంపిక ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేల వంటి రాజకీయ నేతల సిఫారసు లేఖలు ముఖ్య భూమిక పోషించాయని పలువురు ఆరోపిస్తున్నారు.  

తొలి పరాభవం నాకే 
ఏపీ సర్కారు నాకు కళారత్న ప్రకటించి.. రాత్రికి రాత్రే  నా పేరును జాబితానుంచి తొలగించింది. ‘పరాభవ’నామ సంవత్సరంలో తొలి పరాభవం నాకే. ఏపీ సర్కారుకు ధన్యవాదాలు.  – సతీష్‌ చందర్, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement
 
Advertisement
Advertisement