అప్రమత్తత అత్యవసరం
గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ హెచ్చరిక
లండన్: ప్రపంచమంతా కృత్రిమమేధ మంత్రం జపిస్తున్న వేళ జనాలను జాగృతంచేస్తూ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ హితబోధ చేశారు. అపార డేటాను విశ్లేషించి సమాధానం ఇచ్చినంతమాత్రాన కృత్రిమమేధ చెప్పే ప్రతి అంశాన్ని గుడ్డిగా నమ్మొద్దని సుందర్ హెచ్చరించారు. బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తసంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘కృత్రిమమేధ వ్యవస్థలు సైతం తప్పులు చేస్తాయి. తప్పుడు సమాధానాలు అందించే ఆస్కారముంది. అందుకే వినియోగదారులు పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయాల్లోనూ సమాచా రాన్ని వెతకాలి. సమాచారాన్ని పోల్చిచూసుకోవాలి. మా కచ్చితత్వంపై నమ్మకంతో వినియోగదారులు గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తున్నారు.
అయితే దీంతోపాటు గూగుల్ మరెన్నో ఉత్పత్తులను అందిస్తోంది. అయితే మీరేదైనా సృజనాత్మకంగా రచించాలనుకుంటే అందుకోసం ఇతరత్రా టూల్స్ కూడా ఉన్నాయి. కేవలం ఒక్క ఏఐ మీదనే గుడ్డిగా ఆధారపడొద్దు’’ అని అన్నారు. మే నెలలో గూగుల్ ఏఐ మోడ్‌లో సొంతంగా జెమిని చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ‘‘వీలైనంత వరకు అత్యంత కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ మేరకే జెమిని చాట్‌బాట్‌ను సృష్టించాం. అయినాసరే ఇందులోనూ తప్పులు దొర్లేవీలుంది. అందుకే కేవలం ఒక్క ఏఐ సాంకేతికతనే గుడ్డిగా అనుసరించడం తగదు’’ అని అన్నారు.
ఏఐ రంగంలోని పెట్టుబడుల వరదపారుతోంది. ఇది కొంతకాలంలో స్తబ్దుగా మారి ఏఐ బుడగ పేలుతుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ ఏఐ రంగంలో పెట్టుబడులపై ప్రతి కంపెనీ అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే మార్పు అనేది సహజం. ఒకవేళ ఏఐ బబుల్ అనేది పేలితే దాని ప్రభావం ప్రతి కంపెనీపై ఉంటుంది. ఇందులో గూగుల్‌కు ఎలాంటి మినహాయింపు లేదు’’ అని సుందర్ పిచాయ్ అన్నారు.


