ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు మండలి మద్దతు తెలిపింది. మొత్తం 20 అంశాలుగా రూపొందించిన ఈ ప్రణాళికలో అంతర్జాతీయ బలగాల నియోగం, యుద్ధ విరామం, పునర్నిర్మాణం, పాలనకు మార్గదర్శకాలు ఉన్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, సోమాలియా సహా మొత్తం 13 దేశాలు మద్దతు తెలిపాయి. వీటో అధికారం ఉన్న రష్యా, చైనా తటస్థంగా నిలిచాయి. గత నెలలో యుద్ధ విరామం, బందీల విడుదల ఒప్పందంతో ప్రణాళిక మొదటి దశను అమలు చేసిన సంగతి తెలిసిందే. బోర్డ్ ఆఫ్ పీస్ అనే తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేసి.. గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించాలన్నది గాజా ప్లాన్ ఉద్దేశం. అంతేకాదు..
అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు.. అంటే ఐక్యరాజ్యసమితి లేదంటే అంతర్జాతీయ సమాజం ఆధ్వర్యంలో ఏర్పడే బలగాలు మోహరిస్తారు. గాజాలో శాంతి స్థాపన, భద్రత కల్పన, యుద్ధ విరామం అమలు, పునర్నిర్మాణానికి ఈ బలగాల సహకారం అందించనున్నాయి.
హమాస్ ఖండన
అయితే.. ఈ తీర్మానాన్ని హమాస్ ఖండించింది. ఇది గాజా ప్రజల స్వతంత్రతను హరించడమేనని అంటోంది. పాలస్తీనా ప్రజల హక్కులను ఈ ప్రణాళిక విస్మరించిందని, గాజాపై అంతర్జాతీయ పాలనను రుద్దే ప్రయత్నమని ఆరోపించింది. ‘‘ఈ తీర్మానం పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్యం, స్వయంపాలన హక్కులను గౌరవించడంలేదు. ఇక్కడి ప్రజల రాజకీయ ఆకాంక్షలను పక్కన పెట్టి తాత్కాలిక పాలనా సంస్థ పేరిట ఇతర దేశాల నిర్ణయాలను రుద్దే ప్రయత్నంగా కనిపిస్తోంది. గాజా భవిష్యత్తును గాజా ప్రజలే నిర్ణయించాలి. విదేశీ బలగాలు, పాలనా సంస్థలు తమ అభిప్రాయాలను రుద్దకూడదు’’ అని ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.
ట్రంప్ స్పందన
ట్రంప్ ఈ తీర్మానాన్ని "ఐక్యరాజ్యసమితి చరిత్రలో గొప్ప ఆమోదం"గా అభివర్ణించారు. "బోర్డ్ ఆఫ్ పీస్"కు తాను అధ్యక్షత వహిస్తానని, ప్రపంచంలోని శక్తివంతమైన నాయకులు ఇందులో భాగమవుతారని తెలిపారు. తద్వారా.. ట్రంప్ గాజా శాంతి ఒప్పందాన్ని తన నాయకత్వ విజయంగా పునరుద్ఘాటిస్తూనే.. అమెరికా ఆధ్వర్యంలోనే గాజా భవిష్యత్తును మలిచే ప్రణాళిక ఉండబోతోందని తెలియజేశారు.
నెతన్యాహు తిరస్కరణ
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా స్థాపన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ఇది హమాస్‌కు బహుమతిలాంటిదేనని, తద్వారా ఇజ్రాయెల్ సరిహద్దులో మరింత ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారాయన. హమాస్ ఆయుధాలను వీడాల్సిందేనని.. తమదైన శైలిలో అయినా సరే ఆ లక్ష్యాన్ని సాధిస్తామని హెచ్చరించారు.


