సమయం లేదు.. భారీ రక్తపాతం ఎదురు చూస్తోంది
గాజా శాంతి చర్చల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రణాళిక అమలుకు ఎంతో సమయం లేదని.. త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారాయన. ఈ క్రమంలో చర్చలు ఆలస్యమైనా.. అటు ఇటు అయినా.. దారుణమైన పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇది శతాబ్దాల నాటి ఘర్షణ. స్వయంగా ఈ చర్చలను నేనే పర్యవేక్షిస్తుంటా(Trump Gaza Plan). సమయం ఎంతో కీలకం. ఆలస్యం చేస్తే అత్యంత భారీ రక్తపాతం జరుగుతుంది. అలాంటిదాన్ని ఎవ్వరూ చూడాలనుకోరు.. అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఈ వారం చివర్లో గాజా యుద్ధాన్ని ముగించేందుకు.. బందీలను విడుదల చేయడానికి.. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాంతిని నెలకొల్పేందుకు సానుకూల చర్చలే జరుగుతున్నాయి’’ ట్రంప్ అని ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ చర్చలు కీలక దశలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ట్రంప్ గాజా ప్లాన్‌పై ఇజ్రాయెల్, హమాస్(Israel Hamas Deal) రెండూ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. చర్చలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో.. ఇవాళ(సోమవారం) ఈజిప్ట్‌లో ట్రంప్ గాజా ప్లాన్‌పై చర్చలు జరగనున్న నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్‌పై ఒత్తిడిని పెంచేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. కైరో(Cairo)లో ఇవాళ జరుగనున్న ఈ చర్చల్లో హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న యుద్ధం.. మానవీయ సంక్షోభ నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే హమాస్ విముక్త గాజా అంశమూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ సరిహద్దులో జరిపిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో.. ఇప్పటిదాకా వేల మంది పౌరులు మృతి చెందారు. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొందక్కడ. ఈ పరిణామాలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం త్వరగా కుదరాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. గాజా శాంతి ఒప్పందంలో(Gaza Peace Deal) భాగంగా ట్రంప్ సూచించిన 20 అంశాల శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైతం అంగీకారం తెలిపినప్పటికీ.. హమాస్ లక్ష్యంగా గాజా నుంచి పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Truth Social వేదికగా చేసిన తాజా పోస్టులో.. గాజా శాంతి ఒప్పందం మొదటి దశ ఈ వారం పూర్తవుతుందని చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: భారత్‌పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి