
గాజా సంక్షోభం(Gaza War)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas)లు ముందుకు వచ్చాయి. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ·రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు.
ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు చేశారు. ‘‘గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది.
.. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన. ఇది నెరవేరడానికి మాతో పాటు కలిసి పని చేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, టర్కీ(తుర్కీయే)కు థ్యాంక్స్’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ మిలిటెంట్లు విరుచుపడి 1,200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైనే బందీలుగా చేసుకున్నారు. ఆపై హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాపై భీకరంగా విరుచుకుపడి హమాస్ ముఖ్య నేతలందరిని హతమార్చింది. ఈ రెండేళ్ల యుద్ధంలో 67 వేలమందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. 1.70 లక్షలమంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి.
గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందు ఉంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని ఇటీవల హెచ్చరించారు. మరోవైపు మూడు రోజులుగా శాంతి ప్రణాళికపై ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మొదటి దశ అమలుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
ఇజ్రాయెల్ ఏమందంటే..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌కు గొప్పరోజుగా అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు రేపు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు.
హమాస్ ఏమందంటే..
ఇటు శాంతి ఒప్పందాన్ని హమాస్ ధ్రువీకరిస్తూ.. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్టు, తుర్కియే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటుచేసుకోనుందని వెల్లడించింది.

గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని హమాస్ పేర్కొంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: దీపావళికి అమెరికాలో సెలవు ప్రకటన