
బిల్లుపై గవర్నర్ గావిన్ సంతకం
న్యూయార్క్: అమెరికాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మంగళవారం అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్‌రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. అక్టోబర్ 2024లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా మొదటి రాష్ట్రంగా నిలవగా, ఈ సంవత్సరం కనెక్టికట్ ఆ తర్వాతి స్థానంలో ఉంది.
న్యూయార్క్ నగరంలో పబ్లిక్ పాఠశాలలకు దీపావళిని సెలవుగా ప్రకటించారు. ‘భారతీయ అమెరికన్లు మరింత సాంస్కృతిక సమ్మిళితం, గుర్తింపు దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ఈ గుర్తింపు దీపావళి జీవకళనే కాదు, యునైటెడ్ స్టేట్స్‌లో భారతీయ అమెరికన్ల శాశ్వత ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది’.. ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, చైర్మన్ ఎంఆర్ రంగస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లు సహ రూపకర్త అయిన అసెంబ్లీ సభ్యురాలు డాక్టర్ దర్శనా పటేల్‌ను అభినందించారు.