
2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025)ప్రకటనపై యావత్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఈ రేసులో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా గాజా సంక్షోభానికి ముగింపు పడేలా.. ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కి తీరుతుందేమోనన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ అర్హత దక్కే అవకాశాలపై ఓ లుక్కేద్దాం..
తాను శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపానని, ఎనిమిదవ యుద్ధం ముగింపు దశలో(గాజా) ఉందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. తద్వారా జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించటం, అణు నిరాయుధీకరణకు కృషి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం.. లాంటి కృషి చేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అన్నివిధాలా అర్హుడినని అంటున్నారాయన(Trump Nobel Peace Prize). మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం ఇప్పటికే ఆయన్ని ‘పీస్ ప్రెసిడెంట్’గా ప్రకటించుకుంది.
ఇదిలా ఉంటే.. 2025కిగానూ ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఒప్పందం ఆధారంగా ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాలనే ప్రతిపాదనతో యూఎస్ చట్టసభ్యురాలు క్లౌడియా టెన్నీ నామినేషన్ సమర్పించారు. దీనికి ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఆర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా మద్దతు ప్రకటించాయి కూడా.
ఇస్తారా? ఇవ్వరా?
నోబెల్ శాంతి బహుమతి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో ఒకటి. దీనికి ఎవరు.. ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్‌కి బహుమతి వచ్చే అవకాశాలు తక్కువ. నోబెల్ కమిటీ సాధారణంగా దీర్ఘకాలిక శాంతి ప్రయత్నాలు, అంతర్జాతీయ సహకారం, నిరుపేదల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యతగా చూస్తుంది. అంతేకాని తాత్కాలిక ఒప్పందాలు, రాజకీయ ప్రచారాలు కాదు. వీటికి తోడు ట్రంప్ చర్యలు, అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగడం, ప్రజాస్వామ్య విలువలపై ప్రభావం చూపడం.. ఇవన్నీ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే ట్రంప్ ప్రధానంగా చెబుతున్న గాజా ఒప్పందం తాజాగా కుదరగా.. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ గడువు ఫిబ్రవరి 1వ తేదీతోనే ముగియడం గమనించదగ్గ విషయం. పైగా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మద్దతును ప్రకటించిన వాళ్లంతా కూడా ఈ మధ్యకాలంలోనే ఆ ప్రకటనలు చేయడం మరో విశేషం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ట్రంప్ బహిరంగంగా బహుమతిని కోరడం, నోబెల్ కమిటీపై విమర్శలు చేయడం వంటి చర్యలు బహుమతి అవకాశాలను తగ్గించాయి.
అల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా కమిటీ పనిచేస్తోందని.. ఒబామా ఏమి చేశాడో తెలియకుండానే బహుమతి ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. అలాగే.. ఏదో ఒక కారణం చూపుతూ తనకు నోబెల్ ఇవ్వొద్దని చూస్తున్నారని కూడా అన్నారాయన.
ఒకవేళ.. ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. దాని విలువపై ప్రశ్నలు రేకెత్తే అవకాశం లేకపోలేదు. గాజా యుద్ధంలో తాత్కాలిక ఒప్పందం ఆధారంగా బహుమతి ఇవ్వడాన్ని ‘శాంతి కృషి’కి అవమానంగా నిపుణులు భావించే అవకాశం లేకపోలేదు.
నార్వే.. అందుకు సిద్ధమా?..
తనకు నచ్చకున్నా.. కోపం వచ్చినా.. ట్రంప్ ఎంతకైనా తెగిస్తారన్నది గత 9 నెలలకాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన నేపథ్యంలో.. నార్వే అప్రమత్తమైంది.
నోబెల్ బహుమతి తనకే రావాలంటూ నార్వే ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్క్‌కి ట్రంప్ ఇంతకు ముందే ఫోన్ చేశారు. అయితే.. నోబెల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హార్ప్‌వికిన్ మాత్రం తాము ఒత్తిళ్లకు తలొగ్గమని, పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ నిర్ణయం అమెరికాతో తమ దేశ సంబంధాలపై ప్రభావం చూపించొచ్చనే ఆందోళన అక్కడి రాజకీయవర్గాల్లో ఉంది. ‘‘ట్రంప్ ఎలా స్పందిస్తారో తెలియదు.. సిద్ధంగా ఉండాలి’’ అని నార్వే సోషలిస్ట్ పార్టీ నేత క్రిస్టీ బెర్గ్‌స్టో అంటున్నారు.
శాంతి బహుమతి కోసం నోబెల్ కమిటీ 338 నామినేషన్లు (244 వ్యక్తులు, 94 సంస్థలు) స్వీకరించింది, రేసులో.. పాకిస్తాన్(ఇమ్రాన్ ఖాన్), ఎలాన్ మస్క్(అమెరికా), పోప్ ఫ్రాన్సిస్ (ఇటలీ.. మరణాంతరం), అన్వర్ ఇబ్రహీం(మలేషియా)తో పాటు సూడాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సూడాన్), అలాగే.. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(CPJ), ఉమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్ (WILPF) లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రముఖంగా నిలిచాయి.
2025 నోబెల్ శాంతి బహుమతి భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 10న(శుక్రవారం.. ఇవాళే) మధ్యాహ్నం 2:30 గంటలకు (IST) ప్రకటించబడుతుంది. ఈ ప్రకటనను నార్వేలోని ఒస్లో నగరంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నర్ ఫ్రైడ్నెస్ ప్రకటిస్తారు. నోబెల్ ప్రైజ్ అధికారిక YouTube ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.