
గాజా యుద్ధాన్ని ముగించానన్న జోష్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేడు పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. తొలుత ఇజ్రాయెల్‌లో పర్యటించి.. అక్కడి నుంచి ఈజిప్ట్‌లో జరగబోయే అత్యున్నతస్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ పర్యటన కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ ఎయిర్‌పోర్టులో రాయిటర్స్‌తో మాట్లాడారు. గాజా యుద్ధం ముగిసిందని ప్రకటించిన ఆయన.. విషయం అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. అతిత్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా.. తొలుత ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్(Trump In Israel Parliament)లో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశంలో పర్యటించిన నాలుగో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. అటు నుంచి ఆయన ఈజిప్ట్‌కు వెళ్లి.. శర్మ్ ఎల్-షేక్ నగరంలో అత్యున్నత స్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు.
కాల్పుల విరమణలో ఖతార్ దేశ మధ్యవర్తిత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చక్కగా పని చేశారని ప్రశంసించారు. బంధీల విడుదల కూడా ఊహించిన దానికంటే ముందే జరగొచ్చని, ధ్వంసమైన గాజాను బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా పునర్విర్మిస్తామని అన్నారాయన. యూదులు, ముస్లింలు, అరబ్ దేశాలు.. అంతా సంతోషంగా ఉన్నారని అన్నారాయన.
గాజా శాంతి సదస్సు
ఇదిలా ఉంటే.. ఇవాళ శర్మ్ ఎల్-షేక్ నగరం(Sharm El-Sheikh Summit)లో జరగనున్న సదస్సుకి 20కి పైగా ప్రపంచ దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్-సిసి సంయుక్త అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. శాంతి ఒప్పందానికి రూపకల్పన చేయడం, గాజా పునర్నిర్మాణం ప్రధాన లక్ష్యాలుగా ఈ సదస్సు జరగనుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించింది. అయితే ఆయన తరఫున విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్దన్‌సింగ్ హాజరు కానున్నారు.
బందీల విడుదల.. నేడే
దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగనుంది. గాజాలో మూడు ప్రాంతాల్లో వారిని హమాస్ విడుదల చేయనుంది. ఇజ్రాయెల్ బలగాలు, హమాస్ మధ్య ఆదివారం వరకు కాల్పుల విరమణ కొనసాగింది. సోమవారం ఉదయం 20 మంది బంధీలు విడుదలవుతారని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి షోష్ బెడ్రోసియన్ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం.. హమాస్ మొత్తం బంధీలను మధ్యాహ్నం 12 గంటలలోగా విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ 250 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. అయితే హమాస్ సీనియర్ కమాండర్లను మాత్రం విడుదల చేయడం లేదని తెలుస్తోంది. అయితే.. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి బంధించిన మరో 1,700 పాలస్తీనా పౌరుల్ని(ఇందులో 22 మైనర్లు, 360 మిలిటెంట్ల మృతదేహాలు కూడా ఉన్నాయి) విడుదల చేయనున్నటలు ఇజ్రాయెల్ ధృవీకరించింది.
తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. హమాస్‌పై విజయం సాధించాం అని ప్రకటించారాయన. అయితే.. భద్రతా సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక బందీల విడుదల నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు ‘ఆపరేషన్ రిటర్నింగ్ హోంOperation Returning Home’ చేపట్టాయి.
2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో 1,200 మంది మరణించారు. ఆపై 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించడంతో గాజా సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది.
ఇదీ చదవండి: సైనిక తిరుగుబాటుతో అట్టుడికిన మడగాస్కర్!