
ప్రకటించిన అధ్యక్షుడు రజొలినా
తాను దేశంలోనే ఉన్నట్లు వెల్లడి
అంటాననరివో: ఆఫ్రికా దేశం మడగాస్కర్‌లో మరోసారి అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా ప్రకటించారు. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జరిగే ప్రయత్నా లను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు వస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు.
సైనిక బలగాలు ఐక్యంగా ఉండి, రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియడం లేదు. తాను దేశంలోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని రజొలినా కూడా ప్రకటించారు. రజొలినా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జెన్ జెడ్ మడగాస్కర్ పేరుతో యువత ఆందోళనలు సాగిస్తోంది. శనివారం అతిపెద్ద ర్యాలీ జరిగింది.
ఈ ప్రదర్శనలో ఆర్మీలో కీలకమైన క్యాప్‌శాట్ అనే యూనిట్ కూడా పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆదివారం అధ్యక్ష కార్యాలయం తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జాడలు లేవు. రాజధాని వీధుల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. తిరుగుబాటుకు కారణాలు, దీని వెనుక ఎవరున్నారు..వంటి విషయాలను అధ్యక్షుడు రజొలినా వెల్లడించలేదు.