
గాజా శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు తూట్లు పొడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. మంచిగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారాయన.
హమాస్ సంస్థకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంచిగా ఉండాలని.. లేకుంటే అంతం తప్పదని అన్నారు. సోమవారం మీడియాతో ట్రంప్ ఇలా మాట్లాడారు.. ‘‘మంచిగా ఉండాలనే హమాస్‌తో ఒప్పందం కుదిర్చాం. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామంటే ఊరుకోం. హమాస్ మళ్లీ రక్తపాతం కోరుకుంటే మాత్రం వాళ్లకు అంతం తప్పదు’’ అని పేర్కొన్నారు.
.. కాల్పుల విరమణకు కొంత అవకాశం ఇస్తాం. హింస తగ్గుతుందని ఆశిస్తున్నాం. కానీ దాడులు కొనసాగితే ప్రతిస్పందన తప్పదు. వాళ్లు కొనసాగిస్తే మేమే రంగంలోకి దిగుతాం. ఆ పరిష్కారం చాలా వేగంగా.. తీవ్రంగా ఉంటుంది. అలాగని మా సైనికులను అక్కడికి పంపించబోం. శాంతి ఒప్పందంలో సంతకాలు చేసిన ఇతర దేశాలే ఆ సంగతి చూసుకుంటాయి. ఇజ్రాయెల్‌ను కోరితే కేవలం రెండు నిమిషాల్లో అక్కడ వాలిపోతారు. వెళ్లి వాళ్ల అంతు చూడండి అంటే.. చూసేస్తారు. కానీ, ఇప్పటివరకు నేను అలా చెప్పలేదు. అందుకే హమాస్‌కు మరో అవకాశం ఇస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.
2023 అక్టోబర్ 7వ తేదీన మొదలైన గాజా యుద్ధం.. రెండేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికతో ఆగింది. హమాస్, ఇజ్రాయెల కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాటు పలు షరతులకు అంగీకరించడంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి గాజా శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే..
అక్టోబర్ 19వ తేదీన దక్షిణ గాజా రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించి వైమానిక దాడులు జరపడంతో 19 మంది పాలస్తీనీయులు మరణించారు. తొలుత ఇజ్రాయెల్ బలగాలే దాడులు జరిపాయని హమాస్, హమాసే దాడి చేసిందని ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపించుకున్నాయి.
ఈ నేపథ్యంలో.. శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదని, తాజా దాడితో హమాస్ నాయకత్వంతో సంబంధాలు ఉండకపోవచ్చని, అది పూర్తిగా హమాస్ రెబల్స్ పని అయ్యిండొచ్చని ట్రంప్ మొన్న అభిప్రాయపడ్డారు. అయితే..
ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో.. శాంతి ప్రణాళిక అమల్లో సంగ్దిగ్దత నెలకొంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా. అమెరికా ప్రతినిధులు జెరెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ కానున్నారు. సరిగ్గా.. ఈ సమయంలో ట్రంప్ మరోసారి స్వరం మార్చేసి హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
ట్రంప్ మొన్న.. గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. కాల్పుల విరమణ ఇంకా అమలులో ఉంది. హమాస్ నాయకత్వానికి ఈ దాడులతో సంబంధం లేకపోయి ఉండొచ్చు. రెబల్స్ గ్రూప్స్ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చు.
ట్రంప్ తాజాగా.. హమాస్ మంచిగా ఉండాలి. లేకుంటే వాళ్లకు అంతు తప్పదు. ఇజ్రాయెల్‌కు ఒక్కమాట చెబితే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ, మరో అవకాశం ఇస్తున్నా.