
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Gaza War) రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సుమారు 67 వేలమంది పౌరులు(సగం మహిళలు, చిన్నారులే), దాదాపు 2 వేల మంది ఇజ్రాయెల్ తరఫున మరణించారు. ఈ తరుణంలో యుద్ధం ముగింపు ఎప్పుడనే దానిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
మేము యుద్ధం ముగింపు దశకు చేరుకున్నాం. కానీ ఇంకా పూర్తిగా ముగించలేదు. గాజాలో ప్రారంభమైనది గాజాలోనే ముగుస్తుంది. మిగిలిన మా 46 బందీల విడుదలతో, హమాస్ పాలన అంతమయ్యే వరకు ఇది కొనసాగుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తాజాగా వ్యాఖ్యానించారాయన.
బెన్ షాపిరోకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నెతన్యాహు(Netanyahu On gaza War) మాట్లాడుతూ.. ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ మరింత బలంగా ఎదిగింది. ఇరాన్ మద్దతు సంస్థల కూటమి(హమాస్, హెజ్‌బొల్లా, హౌతీలు ఉంటాయి)ని ఎదురించి మరీ నిలిచాం. ఇక మిగిలింది హమాస్ అంతమే అని అన్నారు. ‘‘మేం హమాస్‌ను ఇంకా పూర్తిగా నాశనం చేయలేదు. కానీ, కచ్చితంగా అక్కడిదాకా చేరతాం. యుద్ధం ముగిసింది అంటే.. మా బంధీలు విడుదల కావాలి. అలాగే.. హమాస్ పాలన అంతం అవ్వాలి అని అన్నారాయన.
ట్రంప్‌తో సంబంధాల గురించి..
ఇటీవల కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తన సంబంధం బాగానే ఉందని నెతన్యాహు(Trump Netanyahu Relation) చెప్పుకొచ్చారు. హమాస్‌పై పోరాటంలో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రపంచానికి నిజాన్ని చూపించాయని అన్నారాయన. అయితే.. America First" అంటే అమెరికా ఒక్కటే కాదని, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలు అవసరమని నెతన్యాహూ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ 11,000 కిలోమీటర్ల పరిధి ఉన్న అంతర్జాతీయ క్షిపణులు అభివృద్ధి చేస్తోందని.. ఇది అమెరికా తూర్పు తీరాన్ని చేరగలవని హెచ్చరించారాయన.
అలా మొదలైన యుద్ధం..
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా..
ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 67, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితి..
గాజా యుద్ధం రెండో వార్షికోత్సవం (అక్టోబర్ 7, 2025)లో అడుగుపెట్టిన వేళనే.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే చివరి అవకాశమని, ఆలస్యం వద్దని, త్వరపడకపోతే భారీ రక్తపాతం తప్పదని ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు కూడా.
ఇదీ చదవండి: భారత్ సమాధి కాక తప్పదు!