స్విట్జర్లాండ్ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్‌లోని ఓ లగ్జరీ బార్‌లో నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగిన భారీ పేలుడు గురించి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరుకుంది. తొలుత ఉగ్రదాడి అయ్యి ఉండొచ్చనే ప్రచారం జరగ్గా.. అధికారులు ఆ కోణాన్ని తోసిపుచ్చారు. అయితే..
దర్యాప్తు అధికారులు ఇది ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా జరిగిన ప్రమాదం అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటో అని ఆరా తీస్తున్నారు చాలా మంది. ఇక, ఇప్పటికే ఫ్లాష్ ఓవర్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.
ప్లాష్ ఓవర్ అంటే..
అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) ప్రకారం.. ఒక పరిమిత స్థలంలో వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా ఆ గదిలో త్వరగా అంటుకునే స్వభావం ఉన్న వస్తువులు అన్నీ ఒకేసారి అగ్నిలో చిక్కుకుపోతాయి. ఆ ఫలితంగా.. మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతుంది. అయితే..
ఫ్లాష్‌ఓవర్ అనేది అగ్ని ప్రమాదంలో అత్యంత ప్రమాదకరమైన దశ. కొన్ని సెకన్లలోనే మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. ఇది సాధారణంగా 500–600°C వద్ద జరుగుతుంది. ఈ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.
ఈ ప్రక్రియలో మొదట ఒక వస్తువుకు మంటలు అంటుకుంటాయి. దాని వల్ల ఉత్పత్తి అయ్యే వేడి పొగ పైకప్పు దగ్గరకు చేరుతుంది. ఈ క్రమంలో పొర వేడెక్కి, గదిలోని ఇతర వస్తువులు ఆటో-ఇగ్నిషన్ ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. దీంతో, ఒక్కసారిగా మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. సెకన్ల వ్యవధిలో మంటలు వ్యాపించి.. దహనం అయిపోతుంది. ఈ స్థితిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం మంటలను అదుపు చేయలేరు.
When this happened in America 23 yrs ago in Rhode Island, our National Institute of Standards and Technology (NIST) recreated the fire with the same polyurethane egg-crate foam and sparklers that ignited it.
This is the video showing 1 minute to total flashover. Then, no escape. pic.twitter.com/T52qpPZf5g— Solvated Electron (@Solvatdelectron) January 1, 2026
ఫ్లాష్ ఓవర్ గుర్తించే సంకేతాలు
కాగా, ఫ్లాష్ ఓవర్ జరగబోయే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం తగ్గించుకోవచ్చు.
పొగ రంగు: గాఢమైన నల్ల పొగ, వేగంగా కదిలే పొగ పొర.
వేడి తీవ్రత: గదిలో వేడి ఒక్కసారిగా పెరగడం, నేలస్థాయిలో కూడా వేడి తీవ్రంగా అనిపించడం.
పొగ పొర కదలిక: పైకప్పు దగ్గర పొగ పొర కిందికి దిగుతూ, వేగంగా కదలడం.
ఫైర్ బిహేవియర్: వస్తువులు ఇంకా మంటలు అంటుకోకపోయినా, వేడి వల్ల వాటి ఉపరితలాలు కాంతివంతంగా కనిపించడం.
రేడియంట్ హీట్: గదిలో నిలబడలేని స్థాయిలో వేడి ప్రవాహం (సుమారు 20 kW/m²).
నివారణ చర్యలు
ఫ్లాష్ ఓవర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బంది భవన రూపకర్తలు ఇలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
వెంటిలేషన్ నియంత్రణ: గదిలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా మంటల విస్తరణను తగ్గించడం.
కూలింగ్ వాటర్ స్ప్రే: పైకప్పు పొగ పొరపై నీటిని స్ప్రే చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గించడం.
ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్: భవన నిర్మాణంలో అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించడం.
ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్: భవనంలో పొగ డిటెక్టర్లు, హీట్ సెన్సర్లు వాడటం.
ఫైర్‌ఫైటర్ ట్రైనింగ్: ఫ్లాష్‌ఓవర్ సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం.
ముఖ్యమైన గత ప్రమాదాలు ఇవే..
1923: టోక్యో, జపాన్: భూకంపం తర్వాత మంటలు విస్తరించి నగరం మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
1964: తమిళనాడులోని మదురై స్కూల్ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు.
1997: ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో ఒక్కసారిగా మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు.
2004: తమిళనాడులోని కుంబకోణం పాఠశాలలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 90కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
2024: గుజరాత్‌లోని రాజ్‌కోట్ టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో మంటలు విస్తరించి 33 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులు.
2025: ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు శిశువులు మరణించారు.
2026: స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్-మోంటానా బార్‌లో ప్రమాదం. 47 మంది మరణించారు.


