సౌదీ ప్రమాదంలో బతికి బయటపడింది ఒకే ఒక్కడు
ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున్న అబ్దుల్ షోయబ్
సాక్షి, హైదరాబాద్: సౌదీ ఆరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని జిర్రా నటరాజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాల పాలైన 24 ఏళ్ల షోయబ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన షోయబ్ తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, తల్లి గౌసియా బేగం, తాత మహమ్మద్ మౌలానా మరణించారు. మక్కాలో ఆదివారం ప్రార్ధనలు పూర్తి చేసుకొని రాత్రి 12 గంటలకు ప్రత్యేక బస్సులో బయలు దేరారు.
అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సును నిలిపివేసి కిందకు దూకగా, ఆయనతో పాటు షోయబ్ కూడా కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఉమ్రా యాత్రకు వచ్చి మక్కాలో ఆగిపోయిన తన సోదరుడు సమీర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తర్వాత షోయబ్ తీవ్ర గాయాలతో కింద పడిపోగా డ్రైవర్ పూర్తి సమాచారం అందించాడు. సౌదీ పోలీసులు షోయబ్‌ను ఆసుపత్రికి తరలించారు.


