గ్యాస్‌.. బిజినెస్‌! | Domestic LPG Cylinders Illegally Used By Hotels And Tiffin Centres In Ranga Reddy District, More Details Inside | Sakshi
Sakshi News home page

గ్యాస్‌.. బిజినెస్‌!

Jan 4 2026 11:42 AM | Updated on Jan 4 2026 1:44 PM

domestic gas cylinder misuse at tiffin centers hastinapuram

ఇది హస్తినాపురం జెడ్పీరోడ్డులోని ఓ టిఫిన్‌సెంటర్‌. ఇక్కడ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్‌  విక్రయిస్తుంటారు. కమర్షియల్‌ సిలిండర్‌కు బదులు.. ఇలా డొమెస్టిక్‌  వినియోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న సిలిండర్లను కొంత మంది అక్రమార్కులు కమర్షియల్‌ కేంద్రాలకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఈ ఒక్క టిఫిన్‌ సెంటర్‌లోనే కాదు.. జిల్లాలోని చాలా చోట్ల ఇదే తంతు కొన సాగుతోంది.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్లను అందజేస్తోంది. దీపం, ఉజ్వల పథకాల కింద ఉచితంగా అందజేసిన సిలిండర్లతో పాటు ప్రైవేటు సిలిండర్లు కూడా ఉన్నాయి. జిల్లాలో గృహ, వాణిజ్య కనెక్షన్లు 12 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, గాయత్రీనగర్, జెడ్పీరోడ్డు, బీఎన్‌రెడ్డి, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమనగల్లు, షాద్‌నగర్, శంకర్‌పల్లి, తుక్కుగూడ, జల్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్, తుర్కయంజాల్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లోని ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన వంట గ్యాస్‌ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఏజెన్సీలు, డెలీవరీ బోయ్స్‌ సహకరిస్తుండటంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.    

వినియోగదారుల పేరున బుక్‌ చేసి.. 
రెండు మూడు నెలలకు ఒక సిలిండర్‌ మాత్రమే వినియోగించే వారి నుంచి గ్యాస్‌బుక్‌లను సేకరించి, వారి పేరున సిలిండర్లను బుక్‌ చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో నమోదవుతుండటంతో వారు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలు, డెలివరీ బోయ్స్‌ దీన్ని అవకాశంగా తీసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. నిజానికి 14.2 కిలోల గృహ సిలిండర్‌ ధర రూ.925 కాగా, 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,820 ఉంది. వినియోగదారుల పేరున సిలిండర్‌ బుక్‌ చేసిన ఆయా సిలిండర్లను హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీస్టాళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో సిలిండర్‌పై రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీలు/ డెలివరీ పాయింట్లపై నిరంతరం నిఘా పెట్టాల్సిన సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ విభాగం వారికి పరోక్షంగా వారికి సహకరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల నుంచి ప్రతి నెలా వారికి ముడుపులు ముట్ట జెబుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వాట్సాప్‌ గ్రూపుల్లో ‘జీపే స్కానర్‌’ చక్కర్లు 
సివిల్‌ సప్లయ్‌ విభాగం వాట్సాప్‌ గ్రూపుల్లో ఇటీవల ఓ ‘జీపే స్కానర్‌’ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. డీలర్ల సంక్షేమం పేరుతో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 919 రేషన్‌ షాపులు ఉండగా, ఒక్కో షాపు నుంచి నెలకు రూ.2000 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి నెలా రూ.18.32 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వసూలైన మొత్తంలో ఉన్నతాధికారుల వరకు వాటాలు అందుతున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement