ఢాకా: బంగ్లాదేశ్‌లో 2026, ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా అక్కడి హిందూ మైనారిటీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని హిందువులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపధ్యంలో వారి నుంచి ఈ నిర్ణయం వెలువడింది. బంగ్లాదేశ్‌లోని శరీరత్‌పూర్‌కు చెందిన ఔషధ దుకాణదారుడు ఖోకాన్ చంద్ర దాస్ ఉదంతం అక్కడి హిందువుల దుస్థితికి అద్దం పడుతోంది. డిసెంబర్ 31 రాత్రి దుండగులు ఖోకాన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ మంటల్లో కాలిపోతున్న వ్యక్తి తన తండ్రే అని తెలియక అతని 13 ఏళ్ల కుమారుడు మొబైల్‌లో చిత్రీకరించడం అందరినీ కలచివేసింది. తీవ్ర గాయాలతో ఢాకా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ, జనవరి 3న ఆయన మృతిచెందాడు. ఈ ఘటన అక్కడి హిందువులలో తీవ్ర భయాందోళనలను నింపింది.
1971 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా సుమారు 30 శాతంగా ఉండేది. కానీ నేడు అది కేవలం 9 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇటీవలే దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ తదితర హిందువులు మూక దాడులకు బలయ్యారు. ‘గతంలో దాడులు జరిగేవి.. కానీ మనుషులను సజీవ దహనం చేయడం అనేది ఇప్పుడు కనిపిస్తున్న భయంకరమైన కొత్త పోకడ’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కరువైన తరుణంలో పలు మైనారిటీ సంస్థలు రాబోయే ఎన్నికలను బహిష్కరించి, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని యోచిస్తున్నాయి.
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), జమాత్-ఏ-ఇస్లామీ తదితర పార్టీలు తమ లౌకిక ముద్రను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢాకా-7 నుంచి పోటీకి దిగిన బీఎన్‌పీ అభ్యర్థి హమీదుర్ రెహమాన్ హమీద్ ఇటీవల ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించి, సంతాప సభ నిర్వహించారు. అయితే, హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కాగా ఓటింగ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో హిందూ సంఘాలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. న్యాయమైన రీతిలో ఎన్నికలు జరగాలని కోరుతూ పలు సంఘాలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తమ గోడును ప్రపంచానికి చాటిచెప్పడానికి పోలింగ్ బహిష్కరణే ఏకైక మార్గమని బంగ్లాదేశ్‌లోని పలు హిందూ సంఘాలు చెబతున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రియాంకపై కాంగ్రెస్ గంపెడాశలు.. ’అస్సాం’ అప్పగిస్తూ..


