న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను నియమించింది. ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆమెకు లభించిన మొట్టమొదటి సంస్థాగత బాధ్యత ఇదే కావడం గమనార్హం.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాల రాలేదు. ఈ నేపధ్యంలో సరికొత్త పంథాను ఏర్పరురుచుకుని అస్సాంలో పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను ప్రియాంకా గాంధీకి అప్పగించింది. అస్సాంతో పాటు 2026లో ఎన్నికలు జరగనున్న మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఏఐసీసీ చైర్‌పర్సన్‌లను ప్రకటించింది. కేరళ బాధ్యతలను రాజ్యసభ మాజీ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీకి అప్పగించగా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఛత్తీస్‌గఢ్ మాజీ డిప్యూటీ సీఎం టి.ఎస్. సింగ్ దేవ్ నేతృత్వం వహించనున్నారు. పశ్చిమ బెంగాల్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బి.కె. హరిప్రసాద్‌ను పార్టీ నియమించింది. అభ్యర్థుల వడపోతలో పారదర్శకత, గెలుపు గుర్రాల అన్వేషణే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో 2026 మార్చి-ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అస్సాం అసెంబ్లీ గడువు 2026 మే 20తో ముగియనుండటంతో, అక్కడ మొత్తం 126 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. అయితే ఎన్‌డీఏను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఏఐయూడీఎఫ్ తదితర ప్రాంతీయ శక్తులతో కలిసి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ రాక అస్సాం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కూడా 294 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2011 నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ ఇప్పటికే దూకుడుగా ప్రచారం ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్


