సాక్షి, తెలంగాణ భవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుకథలు చెప్పారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. విభజనలో సెక్షన్-84 పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు. 11వ షెడ్యూల్‌లో మన ప్రాజెక్ట్‌లను ఎందుకు పెట్టలేదు?. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌లను 11వ షెడ్యూల్‌లో పెట్టకపోగా విభజన చట్టంలో రక్షణ కల్పించామని సీఎం చెబుతున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌కు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.
కుట్రపూరితంగా ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీఎం రేవంత్ కక్ష గట్టారు.. పాలమూరుపై పగబట్టారు. కాంగ్రెస్ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటోంది. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోంది. కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్ట్‌లను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.
చంద్రబాబు ముఖం మీదే కేసీఆర్ చెప్పారు..
టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్ ఎప్పుడో ఒప్పించారు. 2016లోనే టెలీమెట్రీ ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతానికే రేవంత్ అన్యాయం చేస్తున్నారు. శాసన సభను రేవంత్ తప్పుదోవ పట్టించారు. తనకు అనుకూలంగా ఉన్న పేజీలను చదివారు. సభలో అసలైన పేజీలను రేవంత్ చదవకుండా వదిలేశారు. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే నీటి హక్కులపై కేంద్రాన్ని నిలదీశాం. కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం. పొతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని ఆనాడే కేసీఆర్ చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే బల్లగుద్దినట్టు కేసీఆర్ మాట్లాడారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్. రేవంత్ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పచెబుదామంటారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్, చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదిరింది అని విమర్శించారు.
60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు..
అసెంబ్లీలో అబద్ధాలు ఆడినందుకు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ మాత్రం ఒక్క ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా కేంద్రానికి పంపించలేదు. మీ పాలనలో మూడు డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి. అరెంజ్‌మెంట్, అగ్రిమెంట్‌కు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి 11 ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లను పంపించాం. ఏడు ప్రాజెక్ట్‌లకు అనుమతి తీసుకొచ్చాం. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా?. రేవంత్ అబద్దాలను చేసి నిజమే ఉరేసుకుంటుందేమో. బీఆర్‌ఎస్ హయంలోనే అత్యధికంగా కృష్ణా నీళ్ల వినియోగం జరిగింది. ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని కేసీఆర్ పరుగులు పెట్టించారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ మరణశాసనం రాసిందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. గత పదేళ్లు నీటి హక్కుల కోసం కేంద్రంపై కేసీఆర్ పోరాడారు. 2023లోనే 66:34 లేకుండానే అగ్రిమెంట్ చేశాం. కృష్ణా జలాల్లో 50:50 నీటి వాటాల కోసం కేంద్రానికి 28 లేఖలు రాశాం. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు.

రేవంత్‌వి బలుపు మాటలు: కేటీఆర్
అంతకముందు కేటీఆర్ మాట్లాడుతూ..‘నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ద్రోహానికి పాల్పడుతోంది. అధికార మదంతో విర్రవీగుతూ, బలుపు మాటలతో రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరితీయాలి. రేవంత్‌కి ఒక్క భాషలో తిట్లు వస్తే మాకు నాలుగైదు భాషల్లో తిట్టడానికి వచ్చు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప తెలంగాణకు ఏం కావాలో.. రేవంత్‌కు తెలియదు. రేవంత్ మాటలతో కేసీఆర్ స్థాయి తగ్గదు. కేసీఆర్ గురించి ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఊరి వేయాలి?. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు.. బేసిన్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉంది అని అడిగే రేవంత్ రెడ్డి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు.


