హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్‌కు 150 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం తప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


