హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి(16), అబ్బాయి(16) ఇద్దరూ పదో తరగతి వరకు ఒక్కటే పాఠశాలలో చదువుకుంటుండగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాది క్రితం వరకూ ఇద్దరూ ప్రేమ పక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో అమ్మాయి, అబ్బాయి కుటుంబీకులకు తెలిసి మందలించి ఒకనొకరు కలుసుకోకుండా షరతులు విధించారు. సినీ ఫక్కీలో గత మరో చరిత్ర సినిమాను తలపించేలా అమ్మాయిని, అబ్బాయిని విడదీసి మేజర్లు అయ్యేవరకు కలుసుకోవద్దని చెప్పారు.
దీంతో సదరు అబ్బాయి పాల్వంచలోనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, అమ్మాయి హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్‌బీటీనగర్ బస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే కుట్టు శిక్షణ తీసుకుంటున్నది. ఈ నెల 31వ తేదీన సదరు అబ్బాయి హైదరాబాద్‌కు వచ్చి ఎన్‌బీటీనగర్‌లోని అమ్మాయి ఇంటికి వెళ్లి అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. ఈ విషయం గత నెల 31న రాత్రి 8 గంటల ప్రాంతంలో అబ్బాయి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌కు పరుగులు తీశారు. ఎన్‌బీటీనగర్‌లోని అమ్మాయి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఒకే గదిలో కనిపించారు.
దీంతో అమ్మాయి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు బాలుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు. అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 16 ఏళ్ల వయస్సులో ఈ ఇద్దరు మైనర్లు మరో చరిత్ర సినిమాను తలపించేలా ప్రేమించుకోవడం, తల్లిదండ్రులు విడగొట్టడం, మళ్లీ కలుసుకోవడం, వ్యవహారం పోలీసుల దాకా రావడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


