
అవధులు లేని ప్రేమ తల్లి ప్రేమ. అందుకే కాబోలు అమ్మ ప్రేమ కోసం..చరిత్రలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యజించేందుకు సిద్ధపడ్డారు. వెలకట్టలేని ఆ గొప్ప ప్రేమకు దైవుడు సైతం తలవంచుతాడని ఆర్యోక్తి. ఇదంతా ఎందుకంటే..నేరమే చేసినా..ఆ తల్లి మాత్రం తన కొడుకుని మంచివాడనే అంటుంది. అలాంటి అసామాన్యమైన ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఈ ఉదంతం తల్లిప్రేమ అనంతం ..బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది అని మరోసారి రుజువు చేస్తోంది.
అంతులేని తల్లిప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ఇది చైనాలో చోటుచేసుకుంది. ఒక హైప్రొఫైల్ కేసులో లిన్(57) అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతడు నగరంలో స్థానిక వ్యవస్థాపకుడు హువాంగ్ అనే వ్యక్తి సుమారు రూ. 140 కోట్లు బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఈ కేసు చైనా జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ మున్సిపల్ ఇంటర్మీడియట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చివరి విచారణ గత నెల జూలై 30న జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న లిన్ తల్లి హి తల్లిడిల్లిపోయింది. తన కొడుకు ఏ నేరం చేయలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. పైగా ఆ ఆరోపణలు ఆవాస్తవం అని ఆమె బలంగా విశ్వస్తిస్తుండటం విశేషం. అంతేగాదు తన కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేసేలా ఏదైనా చేయాలని పలు రకాలుగా అన్వేషించింది. ఇక ఏ లాయర్‌ని నమ్మాలనుకోలేదో లేక తానే రక్షించుకోగలనన్న నమ్మకమో..! గానీ ఆ తల్లి హి లా పుస్తకాలు కుస్తీ పట్టి మరి తన కొడుకుని రక్షించుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది.
కుటుంబ సభ్యులు 90 ఏళ్ల వయసులో ఎందుకు ఈ రిస్క్ అదంతా తాము చూసుకుంటామని చెప్పినా..ససేమిరా అంటూ చట్టం గురించి తెలుసుకోవాలని మంకుపట్టుపట్టి.. క్రిమినల్ లా పుస్తకాలను కొనుగోలు చేసి మరి చదివేందుకు సిద్ధమైంది ఆ తల్లి. దగ్గర దగ్గర తొంభైఏళ్లు పైనే ఉంటాయి ఆ వృద్ధురాలికి. కానీ ఆమె వయోసంబంధిత భారాన్ని ఖాతారు చేయకుండా తగ్గేదేలా అంటూ ప్రతినిత్యం కోర్టుని సందర్శిస్తూ..ఆ కేసుకి సంబంధించిన పూర్వపరాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందామె.
కేసు వివరాలు..
లిన్ స్థానిక వ్యవస్థాపకుడు హువాండ్‌తో గ్యాస్ ఉత్పత్తి బిజినెస్ చేస్తున్నారు. 2009 వరకు చైనాలో టాప్ ధనవంతుల్లో ఒకడిగా మంచి లాభాలు అందుకున్నాడు లిన్. అయితే తరచుగా చెల్లింపులను సకాలంలో చెల్లించడంలో విఫలమవ్వడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చేది. దాంతో బిజినెస్ తీవ్ర నష్టాలకు దారితీసింది.
ఆ నేపథ్యంలోనే 2014 నుంచి 2017 మద్య లిన్ తన అకౌంటెంట్‌తో కలిసి అక్రమదారుల్లో పయనించాడు. తన పార్టనర్ హువాంగ్‌ని అక్రమ పద్ధతిలో వ్యాపారం చేస్తున్నట్లు ఏజెన్సీలకు చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి దాదాపు రూ. 140 కోట్లు వసూలు చేశాడు. అతడి ఆగడాలకు తాళ్లలేక 2023లో పోలీసులను ఆశ్రయించాడు హువాంగ్.
పోలీసుల విచారణలో అది నిజమని తేలడంతో లిన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కొడుకు చేతికి వేసిన సంకెళ్లను చూసి 'హి'కి గుండె ఆగినంత పనైంది. ఆ నేపథ్యంలోనే ఆ తల్లి తన కొడుకుని రక్షించుకునేందుకు ఇలా లా పుస్తకాలను చేతబట్టింది. తన కొడుకు లాంటి మిగతా కేసులను స్టడీ చేసి మరీ రక్షించుకోవాలని ఆశిస్తోందా తల్లి.
ఈ విధంగానైనా తన కొడుకునే కనులారా చూసుకోవాలని కోర్టుకి హాజరవుతూనే ఉంటోంది ఆ వృద్ధురాలు. కొడుకుని చూసి భావోద్వేగానికి గురై స్ప్రుహ తప్పుతున్నా..ఆమెకు కేటాయించిన అంబులెన్స్ వైద్యులచే చెకప్ చేయించుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఆమె ధ్యాసంతా కొడుకుని ఈ కేసు నుంచి ఎలా బయటపడేయాలన్నదే. ఈ తల్లి హి కథ నెట్టింట అందర్నీ తెగ ఆకర్షించడమే గాక తల్లి ప్రేమ మించినది మరొకటి లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాదు ఆమె కొడుకు అతి త్వరలోనే రిలీజ కావాలని భంగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.
(చదవండి: 'స్ట్రీట్‌లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!)