మంచేదైనా జరిగితే తమ ఖాతాలో వేసుకోవటానికి సిద్ధపడేవాళ్లు కోకొల్లలు. ఇది లోకో త్తర సత్యం. ఒకరకంగా అదొక వ్యాధి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ సమస్య ఉంది. తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఇంకా ముగియని యుద్ధాలనూ తానే ఆపానని చెప్పుకోవడంతోపాటు ఉనికిలో లేనివాటికి కూడా అడ్డుచక్రం వేశాననటం ఆయనకే చెల్లింది. ఆ బాణీ ఇంకా ఆపలేదు. ఇప్పుడు చైనా వంతు వచ్చినట్టుంది. 2025లో భారత్–పాక్ ఘర్షణలు నివారించటంతోపాటు అనేక ఇతర యుద్ధాలను ఆపిన ఘనత తమదంటూ తాజాగా వాంగ్–యీ ప్రకటించుకున్నారు.
ఆ రెండు దేశాలూ అనేక రంగాల్లో పోటీపడుతున్నాయి. ఆర్థికంగా ఇప్పటికీ అమెరికాదే పైచేయి అయినా, రేపో మాపో దాన్ని చైనా అధిగమిస్తుందని ఎవరో కాదు... ఆర్థిక నిపుణులే దండోరా వేస్తు న్నారు. ఆ విషయంలో చైనాను ప్రశంసించాల్సిందే! అమెరికాతో పోలిస్తే ఎక్కడో అట్ట డుగునుండే దేశాన్ని 75 ఏళ్లలోనే ఈ స్థాయికి తీసుకురావటం మాటలు కాదు మరి. అంతమాత్రాన అమెరికా చెప్పే అబద్ధాలను కూడా వల్లెవేయటం వంటి చౌకబారు అనుకరణలు బెడిసికొడతాయని చైనా గ్రహించకపోవటం క్షమార్హం కానిది.
కశ్మీర్‌లోని పెహల్గాంలో పాక్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు అనేకమంది అమాయ కులను పొట్టనబెట్టుకున్న వైనం తర్వాత గత ఏడాది మే మొదటివారంలో మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయటం, దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై దాడి చేసే ప్రయత్నం, మనం తిప్పికొట్టడం, ఎదురు దాడి చేయడం వంటివి జరిగాయి. చివరకు కుదిరిన కాల్పుల విరమణ వెనక రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు (డీజీఎంలు) ఉన్నారని మన దేశం చెబుతోంది. ఇలాంటి విషయాల్లో మూడో పక్షం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించ బోమని అప్పట్లోనే స్పష్టం చేసింది.
నిజానికి ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా పాక్ సైన్యం వాడిన ఆయుధ సామగ్రిలో చైనా సరఫరా చేసినవి కూడా ఉన్నాయని అప్పుడే బయటపడింది. ఆ సామగ్రి 81 శాతం అని కూడా తేలింది. పాకిస్తాన్ మనపై ప్రయోగించిన ఆయుధ సామగ్రి చూశాక, ఈ ఘర్షణను ‘సజీవ ప్రయోగశాల’గా చైనా ఉపయోగించుకున్నట్టు కనబడుతోందని కూడా మన దేశం విమర్శించింది. అలాంటి దేశం ‘తగుదు నమ్మా...’ అంటూ ఇరుపక్షాల మధ్యా రాజీకీ దౌత్యం నెరపానని ఇప్పుడు గప్పాలు కొడుతోంది.
లోపాయకారీగా ఘర్షణలను ఎగదోయటం, పైకి శాంతి వచనాలు వల్లించటం ఇటీవలి ధోరణేం కాదు. ఇలాంటి జిత్తులమారి ఎత్తుగడల్లో అమెరికా ఆరితేరింది. ఇజ్రా యెల్ సాగించే అన్ని దాడుల వెనకా ఆ దేశం ఉంటుంది. అవే దాడుల్ని ఆపినట్టు కనబడటంలో ముందుంటుంది. శాంతి సాధన కోసం ‘ఏ సమస్యనైనా వస్తునిష్ఠతో చూడటం, న్యాయమైన వైఖరి తీసుకోవటం’ తమ విధానమని... లక్షణాలనూ, మూల కారణాలనూ తొలగించటమే తమ ధ్యేయమని వాంగ్–యీ చెప్పుకున్నారు. డాలర్ ఇంకా శాసిస్తూనే ఉంది కనుక అమెరికా ఇలాంటి అబద్ధాలు చెప్పినా ఏదోమేరకు చెల్లు బాటవుతాయి. సుంకాలు పెంచుతామని బెదిరించానంటే ‘అవును కాబోలు...’ అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ చైనా సైతం ‘అన్నీ నేనే... అంతా నేనే’ అని అనటం ఎబ్బెట్టుగా ఉంటుంది.
అదను చూసుకుని పక్కనున్న తైవాన్‌ను కబళించాలని ప్రయత్నిస్తూ, మనతో సరిహద్దుల్లో అకారణ వైరానికి దిగుతూ, అరుణాచల్ ప్రదేశ్‌లో గ్రామాల పేర్లు మార్చు కుని మురిసిపోతూ ఇలా తటస్థత నటించటం అనైతికత. చైనాకూ, తైవాన్‌కూ మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నిస్తానని మన దేశం ముందుకొస్తే చైనా అంగీకరిస్తుందా? అధికారంలోకొచ్చిన నాటి నుంచీ నోబెల్ బహుమతి కోసం వెంపర్లాడటం ట్రంప్‌కు ఎక్కువైంది. బహుశా ఆయనకు మోకాలడ్డాలని చైనా ఏమైనా ప్రయత్నిస్తోందేమో! అలా చేయదల్చుకుంటే ట్రంప్ తప్ప వేరెవరూ చైనాను ఆటంకపరచరు. తామిచ్చే శాంతి బహుమతి సైతం ప్రతిష్ఠాత్మకమైనదిగా ఉండేలా చూసుకొనే బాధ్యత నోబెల్ కమిటీది. ఈలోగా లేని పెద్దరికాన్ని ప్రదర్శించటం వల్ల నవ్వులపాలు కావటం ఖాయమని అటు ట్రంప్, ఇటు చైనా తెలుసుకోవాలి.


