
సాయం అంటే కోట్లు కొద్దీ డబ్బు కుమ్మరించడం కాదు. కేవలం డబ్బు రూపంలో కాదు..ఏ రూపంలోనైన తోడ్పాటుని అందించొచ్చని ప్రూవ్ చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది. సాయం చేయాలన్న సంకల్పంల ఉంటే.. ఏ విధంగానైనా చెయ్యొచ్చని తమ చేతలతో చెప్పకనే చెబుతున్నారు వారంతా. అచ్చం అలాంటి స్టోరీనే నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ మహిళ విశాల హృదయానికి ఫిదా అవ్వుతూ..ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.
60 ఏళ్ల సన్ మెయిహువా చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఒక చిన్న కిరాయి దుకాణం నుడుపుతోంది. అయితే ఆ దుకాణం వెలుపల లైట్లు ఆ దారిన వెళ్లే బాటసారుల కోసం ప్రతిరోజు సాయంత్రం ఆన్ అయ్యే ఉంటాయి. అంతేగాదు తన దుకాణం మూసివేసే టైమింగ్స్‌ని కూడా మార్పు చేసుకుంది. రాత్రి రెండు గంటల వరకు లైట్లు ఆన్ అయ్యేలా చూస్తుంది సన్.
అలా ఎందుకంటే..ఆ సమయంలో వచ్చే ఆడపిల్లలు, వృద్ధులు, మహిళలు భయం లేకుండా భద్రంగా ఇంటికి వెళ్లేందుకు ఆ వెలుగు దారి చూపిస్తుందనేది ఆమె నమ్మకం. ఆ మహిళ మంచి మనసుని తెలుసుకున్న స్థానికులు కూడా ఆమెకు అనతికాలంలోనే అభిమానులుగా మారడమే గాక నమ్మకస్తురాలైన స్నేహితురాలిగా సన్‌ను విశ్వసించారు.
అంతేగాదు అక్కడి వాళ్లు ఊరెళ్లటప్పుడూ తమ ఇంటి తాళాలు కూడా ఆమెకే ఇచ్చేలా స్థానికుల నమ్మకాన్ని గెలుచుకుంది. దాంతో అక్కడి వాళ్లంతా ముద్దుగా ఆమెను స్ట్రీట్ లైట్ ఆంటీగా పిలుస్తుంటారు. అలాగే తన దుకాణం వద్ద ఒక ల్యాండ్‌లైన్ ఫోన్‌ని కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ ఫోన్ లేని పిల్లలు, వృద్ధులకు ఉచితంగా కాల్ చేసుకునేలా ఈ సదుపాయన్ని ఏర్పాటు చేసేందామె.
ఆ మహిళ, తన భర్త అక్కడే 20 ఏళ్లుగా నివాసిస్తున్నారు. తాము కష్టాల్లో ఉన్నప్పుడూ ఈ సమాజమే తమను ఆదుకుందని, అందుకే తమ వంతుగా ఈ విధంగా తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని నవ్వుతూ చెబుతున్నారు ఆ దంపతులు. ఆమె కథ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవ్వడంతో ..దాతృత్వం, శ్రద్ధకు నిర్వచనం ఆమె అని అంటున్నారు. ఇలా వెలుగుతో దారి చూపేలా చొరవ చూపేందుకు ధైర్యం, ఓపిక ఎంతో కావాల్సి ఉంటుంది. అంత ఈజీగా చేసే సేవా కార్యక్రమం కూడా కాదది అంటూ స్ట్రీట్‌లైట్ ఆంటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
(చదవండి: Independence Day: నో ఫోన్ అవర్..! స్వేచ్ఛ కోసం ఆత్మీయ పిలుపు..)