అమెరికా సిటిజెన్‌ను పెళ్లి చేసుకొని దూరంగా ఉంటే కార్డు రానట్లే
దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం అధికంగా ఉంది
ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్లు అధికారులకు నమ్మకం కలిగించాలి
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్‌స్టీన్ వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందడానికి దగ్గరి దారి అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడటం. గ్రీన్‌కార్డు అని పిలిచే శాశ్వత నివాస కార్డు(పర్మినెంట్ రెసిడెంట్ కార్డు) కోసం విదేశీయులు ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరుడు/పౌరురాలిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్‌కార్డు సాధించడమే.
అయితే, గ్రీన్‌కార్డు కలిగినవారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలావరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగడానికి ఇదే అసలైన కారణం. అమెరికా పౌరసత్వం కలిగినవారిని పెళ్లి చేసుకుని గ్రీన్‌కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరదని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్‌స్టీన్ తేల్చిచెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్‌కార్డు రావడానికి గ్యారంటీ ఉండదని వెల్లడించారు.
→ యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ని బంధనల ప్రకారం అమెరికా సిటిజెన్‌ను వివా హం చేసుకొని జీవిత భాగస్వామిగా మారిన విదేశీ వ్యక్తిని ‘‘అమెరికా సిటిజెన్ తక్షణ బంధువు’గా పరిగణిస్తారు. అమెరికా పౌరుడు/పౌరు రాలి భార్య/భర్తకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే అర్హత చట్ట ప్రకారం లభిస్తుంది.
→ అమెరికా సిటిజెన్‌ను వివాహం చేసుకుంటే గ్రీన్‌కార్డు వచ్చేసినట్లేనని భావించవద్దని, ఆ అవకాశం ఉండదని బెర్న్‌స్టీన్ తెలియజేశారు. గ్రీన్‌కార్డు పొందాలంటే అమెరికా సిటిజెన్‌తో పెళ్లి ఒక్కటే సరిపోదని చెప్పారు. వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు చాలా ఏళ్లుగా కలిసి జీవిస్తున్నట్లుగా నిర్ధారణ అయితేనే ఈ కార్డు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలపై బెర్న్‌స్టీన్‌కు 30 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నట్లు తెలిస్తే గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రభుత్వం పక్కనపడేసే ప్రమాదం అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఒకే ఇంట్లో కలిసికట్టుగా ఉంటేనే అవకాశాలు మెరుగు పడతాయని ఆయన సూచించారు.
→ ఉద్యోగం, పిల్లల చదువులు వంటి కారణాలతో వేర్వేరుగా ఉంటున్నామని దంపతులు చెప్పినా అధికారులు వినిపించుకునే పరిస్థితి ఉండదని బెర్న్‌స్టీన్ స్పష్టంచేశారు. కలిసి ఉంటున్నట్లు వారికి విశ్వాసం కలిగించాలని పేర్కొన్నారు. దంపతులు నిత్యం ఒకే ఇంటిని పంచుకోవడం అనేది వివాహనికి నమ్మకమైన గుర్తింపుగా ఇమ్మిగ్రేషన్ చట్టాలు భావిస్తాయని తెలిపారు.
→ పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించేవారు తొలుత న్యాయ సహాయం తీసుకోవాలని స్పష్టంచేశారు. అమెరికా వీసాలు, గ్రీన్‌కార్డుల కోసమే అమెరికా సిటిజెన్‌ను పెళ్లి చేసుకున్నట్లు తేలితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు.
→ డొనాల్డ్ ట్రంప్ పాలనలో వివాహం ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ వివాహం అసలైనదేనా? దురుద్దేశం ఏదైనా ఉందా? అనే తనిఖీ చేస్తున్నారు. కేవలం కాగితాలపై జరిగిన పెళ్లి అని తేలితే దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.
→ అమెరికా వీసాల జారీ కార్యక్రమాన్ని ట్రంప్ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. డైవర్సిటీ వీసా(డీవీ) లాటరీని రద్దు చేశారు. ఈ లాటరీ ద్వారా విదేశీయులకు ఏటా 50 వేల దాకా వీసాలు ఇచ్చేవారు. ప్రస్తుతం అవన్నీ ఆగిపోయినట్లే.
→ గ్రీన్‌కార్డుల కార్యక్రమంపై ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా గురిపెట్టింది. నిబంధనలు కఠినతరం చేసింది. ఇప్పటికే గ్రీన్‌కార్డు పొందిన 19 దేశాల ప్రజల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని ట్రంప్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


