
నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర
సుప్రీంకోర్టులో జస్టిస్ వర్మ పిటిషన్
న్యూఢిల్లీ: నోట్ల కట్టల విషయంలో అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.
ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎంక్వైరీ కమిటీ నివేదికను రద్దు చేయాలంటూ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అత్యంత అరుదైన ఘటన అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
నోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.
తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
అభిశంసన తీర్మానం ప్రవేశపెడతాం: మేఘ్వాల్
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపె ట్టనున్నట్లు న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ శుక్రవారం వెల్లడించారు. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది ఎంపీలేనని, ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు లేదా హై కోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించే హక్కు పార్లమెంట్‌కు ఉందని గుర్తుచేశారు. అభిశంసన తీర్మానానికి లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమని అన్నారు.