అధిక రాబడులిచ్చినంత వరకు యాక్టివ్ ఫండ్స్‌కి ఆదరణ
దీర్ఘకాలికంగా పెట్టుబడులు కొనసాగిస్తే ప్రయోజనకరం
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా
అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్లు (సిప్), మార్కెట్ వృద్ధితో అసెట్ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా తెలిపారు. రిటైర్మెంట్ లేదా పిల్లల చదువులాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మదుపరులు, చివరివరకు పెట్టుబడులను కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.
యాక్టివ్ వ్యూహాలు అత్యధిక రాబడులను అందించినంత వరకు వాటిపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతుందని షవివరించారు. దేశీయంగా యాక్టివ్ ఫండ్లు సహేతుకమైన పనితీరును కనపరుస్తున్నందున వాటిల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏదైనా ఫండ్ సంస్థకు ఇతర సంస్థల నుంచి పోటీ, లేదా నియంత్రణ నిబంధనలపరమైన రిసు్కల కన్నా పనితీరు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే పెద్ద రిసు్కగా ఉంటుందని షా వివరించారు.
‘‘డిజిటైజేషన్, డెమోగ్రాఫిక్స్, ఆర్థిక అసెట్ద్‌లోకి కుటుంబాల పొదుపు మొత్తాలు భారీగా వస్తుండటంలాంటి అంశాల దన్నుతో భారత జీడీపీ గణనీయంగా వృద్ధి నమోదు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ఊతంతో దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి రూపంలో ఈక్విటీ మార్కెట్లలో కూడా ఇది ప్రతిఫలిస్తోంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులను కొనసాగించే వారికి సముచితమైన ప్రతిఫలం దక్కుతుందని ఇవి నమ్మకం
కలిగిస్తున్నాయి’’ అని షా తెలిపారు.
లిస్టయినా జవాబుదారీతనం యథాతథం..
‘‘స్టాక్ మార్కెట్లలో కంపెనీ లిస్టయినప్పటికీ మా జవాబుదారీతనం, బాధ్యతలేమీ మారవు. ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించి, వారి సంపద వృద్ధి చెందితేనే మా ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి యూనిట్‌హోల్డర్లకు ఒనగూరే ప్రయోజనాలతో షేర్‌హోల్డర్ల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అన్నింటికన్నా ప్రధానంగా డబ్బును నిర్వహించే రిస్క్ మేనేజ్‌మెంట్ కంపెనీగానే మమ్మల్ని మేము భావిస్తాం. లిస్టింగ్ తర్వాత కూడా అదే కొనసాగుతుంది. ఫండ్ పరిశ్రమ చాలా విస్తృత స్థాయి వ్యాపారం. ఇన్వెస్టర్లకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియంత్రణ సంస్థ వ్యయాలను క్రమబదీ్ధకరించింది. దీనితో ఇన్వెస్టర్లకు ఫండ్స్ మరింత అందుబాటులోకి వస్తాయి. అలాగే మార్జిన్లు తగ్గినా పరిమాణం పెరగడం వల్ల సంస్థకు ఆ మేరకు భర్తీ అవుతుంది. కాలక్రమేణా అధిక లాభాలకు దోహదపడుతుంది’’ అని షా చెప్పారు.
ఇక ఐపీవో వల్ల కంపెనీ నిర్వహణ స్వరూపం ఏమీ మారదన్నారు. గత మూడు దశాబ్దాలుగా పెట్టుబడులు కొనసాగిస్తున్న ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ పాక్షికంగానే వాటాలను విక్రయిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంకు మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి అదే మేనేజ్‌మెంట్, అవే పెట్టుబడి సూత్రాలు, గవర్నెన్స్‌తో వ్యాపారం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ ఇష్యూతో లిక్విడిటీ, యాజమాన్యం పెరుగుతుందే తప్ప కంపెనీ వ్యూహంలో మార్పు ఉండదని షా తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరున్న పలు దిగ్గజ సంస్థలు యాంకర్ ఇన్వెస్టర్లుగా ఈ ఇష్యూలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. తమ బిజినెస్ మోడల్, నిర్వహణ క్రమశిక్షణ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, భారత అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమపై వాటికున్న నమ్మకానికి ఇది నిదర్శనంగా ఉంటుందని వివరించారు.


