దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్ సీజన్‌లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. సెలవ రోజులు గడిపేందుకే కాకుండా కాస్త రిలాక్స్ అయ్యేందుకు కూడా శీతాకాలం ట్రిప్‌లను భారతీయులు ఎంచుకుంటున్నారు. టెక్ హాస్పిటాలిటీ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
‘ఎయిర్‌బీఎన్‌బీ అంతర్గత డేటా ప్రకారం ఈ శీతాకాలం సీజన్‌లో గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయ ప్రాంత రాష్ట్రాలపై ట్రావెలర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బీచ్‌లు, బ్యాక్‌వాటర్లు, సంస్కృతి, శీతాకాలపు వాతావరణం, ఔట్‌డోర్ అనుభూతులు మొదలైన అంశాలు ఇందుకు సానుకూలంగా ఉంటున్నాయి‘ అని ఎయిర్‌బీఎన్‌బీ కంట్రీ హెడ్ అమన్‌ప్రీత్ బజాజ్ తెలిపారు.
సానుకూల చల్లని వాతావరణం, ఆకర్షణీయమైన ప్రాంతాల దన్నుతో ప్రస్తుతం ఫేవరెట్ ట్రావెల్ సీజన్‌లలో శీతాకాలం కూడా చేరిందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎయిర్‌బీఎన్‌బీ రూపొందించింది. 2,155 మంది పర్యాటకులు ఇందులో పాల్గొన్నారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
లక్షద్వీప్‌లోని అగట్టి, గౌహతితో పాటు పంజాబ్‌లోని చిన్న నగరాలు, కేరళలో పెద్దగా తెలియని తీర ప్రాంత, బ్యాక్‌వాటర్స్ పట్టణాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
యువ ట్రావెలర్లు .. వారణాసి, బృందావన్‌లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పర్యటిస్తున్నారు.
శీతాకాలంలో పర్యటించే వారిలో దాదాపు సగం మంది జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ వారే ఉంటున్నారు. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన, అందమైన లొకేషన్స్‌ను ఆస్వాదించేందుకు శీతాకాలంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.
సీజనల్ సెలవలను గడిపేందుకు శీతాకాలంలో ప్రయాణిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 30 శాతం మంది తెలిపారు. సేద తీరేందుకు ట్రావెల్ చేస్తున్నట్లు 30 శాతం మంది, సరికొత్త సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఈ సీజన్‌ను ఎంచుకుంటున్నట్లు 20 శాతం మంది వివరించారు.
పర్యటనల విషయంలో ఎక్కువ శాతం మంది తమకు అత్యంత సన్నిహితులతోనే కలిసి వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. 50 శాతం మంది తమ జీవిత భాగస్వామితో కలిసి వెళ్తుండగా, మూడో వంతు మంది.. స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. రెండు మూడు తరాల కుటుంబ సభ్యులతో కలిసి తాము ట్రిప్‌లను ప్లాన్ చేస్తామని 30 శాతం మంది వివరించారు. గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్ నుంచి మనాలీ, ముస్సోరీలో పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రాలుగా ఉండే ఉదయ్‌పూర్, జైపూర్‌లాంటి నగరాల వరకు దేశీయంగా కొత్త ప్రాంతాల్లో పర్యటించడంపై, వాటి గురించి తెలుసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది.


