
ప్రయివేట్ పెట్టుబడులపై ఎస్‌అండ్‌పీ అంచనా
మధ్య, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధించేందుకు అత్యుత్తమ అవకాశాలున్నట్లు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ తాజాగా అభిప్రాయపడింది. దీంతో రానున్న ఐదేళ్లలో ప్రయివేట్ రంగం నుంచి 800 బిలియన్ డాలర్ల(రూ. 70 లక్షల కోట్లు) పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రయివేట్ పెట్టుబడులు ఊపందుకునే చాన్స్ లేనట్లు పేర్కొంది.
ప్రయివేట్ రంగంలో భారీస్థాయి సామర్థ్య విస్తరణలో అప్రమత్తత కనిపిస్తున్నట్లు సంస్థ అధికారి గీతా చుగ్ తెలియజేశారు. కాగా.. ప్రయివేట్ రంగంలో పెట్టుబడులు కనిపిస్తున్నప్పటికీ నామినల్ జీడీపీ వృద్ధి రేటుకంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నట్లు ఎస్‌అండ్‌పీ దేశీ రేటింగ్స్ యూనిట్ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషీ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాలు, టారిఫ్‌లలో మార్పులు, తదితర తీవ్ర అనిశ్చితులు కార్పొరేట్ సంస్థల పెట్టుబడి నిర్ణయాలలో ఆలస్యానికి కారణమవుతున్నట్లు వివరించారు.
పలు కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకోవడంలో బ్యాంకులకు బదులుగా సొంత అంతర్గత వనరులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంక్ రుణాలు లేదా క్యాపిటల్ మార్కెట్ల నుంచి రుణ సమీకరణ ద్వారా కనీసస్థాయిలోనే నిధులను సమీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పరిస్థితులు మెరుగుపడనుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో 12–13 శాతం రుణ వృద్ధికి వీలున్నట్లు అంచనా వేశారు.
ఇదీ చదవండి: దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?