
తెలంగాణ పారిశ్రామిక విభాగంలో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా సాఫ్ట్‌డ్రింక్స్ తయారీ దిగ్గజం కోకాకోలా(Coca Cola) చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కంపెనీ రూ.2,398 కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో అత్యాధునిక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఇటీవల పారిశ్రామిక ప్రోత్సాహంపై జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈమేరకు ఆయన ప్రకటన చేశారు.
పారిశ్రామిక వృద్ధి ద్వారా అధిక విలువ కలిగిన పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రంలో ఉపాధిని సృష్టించడానికి తెలంగాణ(Telangana) ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రయత్నంలో ఈ చర్య భాగమన్నారు. అనేక పండ్ల ఆధారిత పానీయాల్లో కీలకంగా ఉన్న మామిడి, నారింజకు స్థిరమైన డిమాండ్ అందించడం ద్వారా కోకాకోలా ఫెసిలిటీ స్థానిక రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సమావేశంలో ఆమోదించిన మరో రెండు ప్రధాన ప్రతిపాదనలతో పాటు కోకాకోలా భవిష్యత్తులో రూ.3,745 కోట్ల పెట్టుబడిని సూచిస్తుందని, రాష్ట్రంలో 1,500 కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మంత్రి హైలైట్ చేశారు.
ఈ సమావేశంలో భాగంగా తోషిబా ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తెలంగాణలో గ్యాస్-ఇన్సులేటెడ్ స్విచ్ గేర్, బుషింగ్స్ కోసం రూ.562 కోట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, రక్షణ రంగాలను హైలైట్ చేస్తూ హైదరాబాద్‌లోని మహేశ్వరంలో రూ.785 కోట్ల విలువైన డ్రోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని జేఎస్‌డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ యోచిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ట్రయినీల నియామకానికి వ్యతిరేకంగా సమ్మె