
భారతదేశంలోని ప్రముఖ టైర్ తయారీ కంపెనీల్లో ఒకటైన ఎంఆర్ఎఫ్ లిమిటెడ్‌లో ట్రయినీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై-తిరువొట్టియూర్ ప్లాంట్‌లో కొంతమంది కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఈ విషయాన్ని బీఎస్‌ఈకి అందించిన ఫైలింగ్‌లో ఎంఆర్ఎఫ్ ధ్రువీకరించింది. ట్రయినీలు, ఉద్యోగులకు వార్షిక బీమా ప్రీమియం ముందస్తు చెల్లింపుపై ఫిర్యాదులను పేర్కొంటూ, ప్రభుత్వ పథకాల కింద ట్రెయినీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ఈ సమ్మె చట్టవిరుద్ధం అని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ సమ్మెతో వార్షిక వైద్య బీమా ప్రీమియం చెల్లింపు, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్), ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్), నాన్ ముధల్వన్ పథకంతో సహా వివిధ ప్రభుత్వ పథకాల కింద ట్రయినీలను నియమించుకోవాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం చుట్టూ వివాదం ఏర్పడినట్లయింది. తిరువొట్టియూర్ ప్లాంట్‌లో కార్యకలాపాలు సమ్మెలో భాగం కాని కార్మికుల సహాయంతో పాక్షికంగా కొనసాగుతున్నాయని ఎంఆర్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. వీలైనంత త్వరగా ప్లాంట్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పెట్టుబడిదారులు, వాటాదారులకు హామీ ఇచ్చింది.
సమ్మె వివరాలు
ఎంఆర్ఎఫ్ విస్తృత తయారీ సముదాయంలో భాగమైన విమ్కో నగర్ యూనిట్‌లో సుమారు 800 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వార్షిక వైద్య బీమా ప్రీమియం కోసం చెల్లింపు నిర్మాణంపై కార్మికులు ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా ట్రయినీలను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని స్థానంలో సాధారణ కార్మికులను భర్తీ చేయవచ్చని వారు వాదిస్తున్నారు. సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సౌందరరాజన్ మాట్లాడుతూ..సమ్మె కారణంగా గత వారం రోజులుగా విమ్కో నగర్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రభావితమైందన్నారు. ప్రీమియం చెల్లింపు సమస్యపై కార్మికులు పరిష్కారం కోరుతున్నారని తెలిపారు. కంపెనీ అనుసరిస్తున్న విధానం అన్యాయమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బిగ్‌రిలీఫ్.. బంగారం ధరలు యూటర్న్!