సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్‌నెస్ ఫీజులను పెంచే నోటిఫికేషన్ అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిలిపివేయని పక్షంలో ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామన్నారు. రాష్ట్రంలోని రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్ యార్డులలో గూడ్స్ రవాణా వాహనాలు నిలిపివేయడానికి నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది.
ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ.. 13 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్‌నెస్ ఫీజు కేంద్రం భారీగా పెంచిందన్నారు. వాహన యజమానులు భారీగా ఫీజు చెల్లించాల్సి వస్తోందన్నారు. 20 ఏళ్లు దాటిన పాత వాహనాల ఫీజు రూ33వేల 400కు పెంచారు. పెంపు వల్ల వేలాది లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతారు. పాత వాహనాలపై అదనపు టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
చట్టం అమలు చేస్తే చిన్న వాహన యజమానులు దారుణంగా నష్టపోతారు. సరకు రవాణా యజమానులపై పెను భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా రాష్ట్రం అమలు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అమలు ను వెంటనే నిలిపివేయాలి. వెంటనే ఫీజులు తగ్గించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 9 నుంచి ఆందోళనకు దిగుతాం. రాష్ట్రంలో తిరిగే 10 వేల గూడ్స్ వాహనాలను నిలిపివేస్తాం. అన్ని వాహనాలకు వెహికిల్ లొషన్ ట్రాకింగ్ డివైజ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది.
ఫ్యాసింజర్ వాహనాలకు వీఎల్‌టీడీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం సరైనదే. గూడ్స్ వాహనాలకు వీఎల్ టీడీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. తగిన గడువు పెంచి వీఎల్ టీడీ అమలు చేస్తే సరకు రవాణా వాహనాలకు విఎల్ టీడీ ఏర్పాటుకు సహకరిస్తాం. నష్టాల్లో ఉన్న లారీ యజమానులపై భారం పడకుండా కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని వైవీ ఈశ్వరరావు పేర్కొన్నారు.


