కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది ఉత్సవాలకు 2030లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి స్థానిక మార్కెట్‌లో సిమెంట్ డిమాండ్ గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని, ఇది నిర్మాణ రంగానికి, సిమెంట్ కంపెనీలకు కలిసి వస్తుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
నువోకో విస్తరణ
దేశంలోని ప్రముఖ సిమెంట్ సంస్థల్లో ఒకటైన నువోకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ భవిష్యత్తులో పెరిగే ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జయకుమార్ కృష్ణస్వామి మాట్లాడుతూ.. తమ కంపెనీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2030 నాటికి అహ్మదాబాద్ మార్కెట్‌లో డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
వద్రాజ్ సిమెంట్ కొనుగోలు
నువోకో ఇటీవల వద్రాజ్ సిమెంట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. దీని ద్వారా కంపెనీ గుజరాత్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఈ కొనుగోలులో భాగంగా కచ్‌లో 3.5 ఎండీపీఏ(మిలియన్ టన్స్ పర్ యానం) క్లింకర్ ప్లాంట్, సూరత్‌లో 6 ఎంటీపీఏ గ్రైండింగ్ యూనిట్ వంటివి సొంతం అవుతాయి. ఈ ఆస్తులు 2027 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తాయని భావిస్తున్నారు. ఈ అదనపు సామర్థ్యంతో నువోకో మొత్తం స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000..!


