భారతదేశం విద్యారంగం చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024-25లో మొత్తం పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య ఒక కోటి మార్కును దాటడం దీనికి నిదర్శనం. అయితే దేశంలోని విద్యారంగంలో కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కేవలం విద్యా నాణ్యతకే పరిమితం కాకుండా, దేశ సుస్థిర ఆర్థిక వృద్ధికి, మానవ వనరుల అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ప్రధాన సమస్యలు
విద్యార్థులు లేని పాఠశాలలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అంతటా దాదాపు 8,000 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రభుత్వం ఖర్చు చేసిన వనరులపై ఎలాంటి ఫలితాలు అందించని పెట్టుబడిని సూచిస్తాయి. భవనాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతాల కోసం ఖర్చు చేసిన ప్రజా ధనం వృథా అవుతుంది. చాలాచోట్ల పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాల రూపంలో ప్రజాధనం పంపిణీ అవుతున్నా ఉత్పత్తి శూన్యం (Zero Output). అంటే విద్యార్థులకు విద్య అందకపోవడం, ద్రవ్య వనరుల దుర్వినియోగానికి ఇది దారితీస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
జీతాలు లేకుండా పనులు..
కొన్ని చోట్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు సుమారు 20,000 మందికి పైగా జీతాలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది వ్యవస్థాపరమైన లోపాలను స్పష్టం చేస్తుంది. తమిళనాడు, కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ‘సమగ్ర శిక్ష’ వంటి పథకాల కింద పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు తమ వేతనాల్లో ఆలస్యం జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడం కారణంగా ఉంది.
జీతాల ఆలస్యం ఉపాధ్యాయుల్లో నిరాశ, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు తమ వృత్తిపై దృష్టి పెట్టలేక ఆర్థిక భద్రత కోసం అదనపు వనరులను వెతుక్కోవాల్సి వస్తుంది. జీతాల ఆలస్యం కారణంగా ఉపాధ్యాయుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది వినియోగాన్ని తగ్గించి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
ఇదీ చదవండి: రిటైర్డ్ బ్యాంకర్లకు గుడ్ న్యూస్


